రాజశేఖర్ నిజాయితీకి అవకాశాలు రావాలి

ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష రాని రాజశేఖర్ దర్శకుడు కోడి రామకృష్ణతో చేసిన సినిమాలు గట్టి పోటీ ఇచ్చేలా చేశాయి. ముఖ్యంగా అంకుశం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. పోలీస్ ఆఫీసర్ గా వేరొకరిని చూడలేమన్నంత గొప్పగా ఆ పాత్రను పోషించిన విధానం ఒక డిక్షనరిలా ఉండిపోయింది. ఇలాంటి సీరియస్ మూవీస్ చేస్తూనే అల్లరి ప్రియుడు లాంటి రొమాంటిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టారు రాజశేఖర్.

ఇదంతా గతం. సాయికుమార్ ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పడం ఆపేశారో అప్పటి నుంచి కాకతాళీయంగా రాజశేఖర్ గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యింది. అయినా సరే మనసున్న మారాజు, సూర్యుడు, మా అన్నయ్య లాంటి సూపర్ హిట్లు ఆయన మార్కెట్ ని కాపాడుకుంటూ వచ్చాయి. కానీ ఒక దశ దాటాక వరస ఫ్లాపులు బాగా డ్యామేజ్ చేశాయి. ఎవడైతే నాకేంటితో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ ఆనందం కూడా ఎక్కువ సేపు నిలవలేదు. రీ ఎంట్రీలో తీసిన శేఖర్ లాంటివి వర్కౌట్ కాలేదు.

పలు పత్రికా కథనాల్లో షూటింగ్ కు లేట్ గా రావడం గురించి, ఆయన కోపం గురించి పలు కథనాలు వచ్చేవి. ఒక స్టేజి మీద చిరంజీవితో విభేదించడం, వేరొక సందర్భంలో ప్రజా రాజ్యం గురించి చేసిన విమర్శలు కొంత నెగిటివిటీ అయితే తీసుకొచ్చాయి. ఇవన్నీ మర్చిపోయి రాజశేఖర్ కొత్త ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నారు. బైకర్ స్టేజి మీద ఓపెన్ గా మీడియా సాక్షిగా మీ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అంటూ దర్శక నిర్మాతలను అమాయకంగా రిక్వెస్ట్ చేయడం పలువురిని కదిలించింది.

బైకర్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఓపెన్ అవుతున్నారు. గోటిల ఫ్యాక్టరీ లాంటి ఫన్నీ మీమ్స్ నుంచి మొదలుపెట్టి మెగాస్టార్ తో విభేదాల దాకా అన్నిటి గురించి క్లారిటీ ఇస్తున్నారు. చేతులారా వదులుకున్న బ్లాక్ బస్టర్ల గురించి మొహమాటం లేకుండా వివరిస్తున్నారు. మంచి ఆరోగ్యంగా కనిపిస్తున్న రాజశేఖర్ కోసం రైటర్లు, డైరెక్టర్లు మంచి క్యారెక్టర్లు కనక రాస్తే జగపతిబాబు, శ్రీకాంత్ లాగా టాలీవుడ్ కు ఒక స్టార్ సపోర్టింగ్ ఆర్టిస్టు దొరికినట్టే.