దురంధ‌ర్ ప్ర‌భంజనం.. హీరో భార్య‌కు న‌చ్చట్లేదా?

గ‌త మూణ్నాలుగు నెల‌లుగా ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో అత్యంత చ‌ర్చ‌నీయాంశం అయిన సినిమా అంటే.. దురంధ‌ర్‌యే. గ‌త ఏడాది డిసెంబ‌రు 5న విడుద‌లై ఎవ్వ‌రూ ఊహించని స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందీ చిత్రం. రెండు నెల‌ల పాటు నిల‌క‌డగా వ‌సూళ్లు సాధించి, ఏకంగా రూ.1300 కోట్ల మార్కును దాటిన‌ దురంధ‌ర్.. ఓటీటీలో రిలీజై అక్క‌డా అద్భుత స్పంద‌న తెచ్చుకుంది. దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు రిలీజై దురంధ‌ర్-2 మ‌రింత‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.

తొలి రోజే ఏకంగా రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ ఊపులో ఇండియ‌న్ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా నిలిచే అవ‌కాశాలు మెండుగానే క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా స‌క్సెస్ క్రెడిట్ ప్ర‌ధానంగా ద‌ర్శ‌క నిర్మాత ఆదిత్య ధ‌ర్‌కు వెళ్తుంది. అత‌డి త‌ర్వాతి స్థానం ర‌ణ్వీర్ సింగ్‌దే.

జ‌స్కీర‌త్ సింగ్ రంగి అలియాస్ హంజా అలీ మ‌జారి పాత్ర‌లో ర‌ణ్వీర్ సింగ్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. బాడీ ట్రాన్స్‌ఫర్మేష‌న్ ద‌గ్గ‌ర్నుంచి.. యాక్టింగ్ వ‌ర‌కు అత‌ను ది బెస్ట్ ఇచ్చాడు. ఈ పాత్ర కోసం అత‌ను ప్రాణం పెట్టేశాడ‌ని చెప్పొచ్చు. అందుకే త‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.
ఇలా ఒక హీరో మీద ఈ స్థాయిలో ప్ర‌శంస‌లు కురుస్తుంటే.. తన సినిమా వ‌సూళ్ల మోత మోగిస్తుంటే కుటుంబ స‌భ్యులు ఎంతో సంతోషిస్తారు సాధార‌ణంగా.

కానీ ర‌ణ్వీర్ సింగ్ భార్య దీపికా ప‌దుకోన్ మాత్రం అంత హ్యాపీగా లేదా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. దురంధ‌ర్ రిలీజైన‌పుడు కానీ.. దురంధ‌ర్‌-2 వ‌చ్చిన‌పుడు కానీ.. ఆమె ఆ సినిమాల గురించి స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియా పోస్టులు పెట్ట‌డం కానీ.. మీడియాతో త‌న ఆనందాన్ని పంచుకోవ‌డం కానీ చేయ‌లేదు. అస‌లెక్క‌డా దీపిక‌.. దురంధ‌ర్ ఊసే ఎత్త‌లేదు.

ఇక ముందూ ఆ సినిమా గురించి మాట్లాడేలా క‌నిపించ‌డం లేదు. దురంధ‌ర్‌ను ఒక వ‌ర్గం ప్రాప‌గండా ఫిలిం అని, అది బీజేపీ ప్రాయోజిత సినిమా అని విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే బాలీవుడ్లో ఎక్కువ‌గా బీజేపీ వ్య‌తిరేక భావ‌జాలంతో ఉంటారు. సినిమాలు కూడా అలాగే తీస్తుంటారు. ఆ ట్రెండును ఆదిత్య బ్రేక్ చేశాడ‌ని.. కాంగ్రెస్, లెఫ్ట్ ప్రో ఐడియాల‌జీని తుత్తునియ‌లు చేశాడ‌ని.. దీన్ని వాళ్లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

దీపికాది సైతం బీజేపీ వ్య‌తిరేక భావ‌జాల‌మే అని గ‌తంలో జేఎన్‌యూ సంద‌ర్శ‌న సంద‌ర్భంలో చ‌ర్చ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో భ‌ర్త సినిమా అయిన‌ప్ప‌టికీ దురంధ‌ర్ అంత స‌క్సెస్ కావ‌డం దీపికాకే అంత న‌చ్చ‌ట్లేదేమో.. అందుకే ఆమె మౌనం వ‌హిస్తోందేమో అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.