చిరు కోసం అలా మారుస్తున్నార‌ట‌

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా రెండు రీమేక్ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో మొద‌టిది మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్ ఆధారంగా తెర‌కెక్క‌నున్న సినిమా. ఇటీవ‌లే ఈ చిత్రానికి తెలుగువాడైన త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాను ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు చేశారు. ఇంత‌కుముందు సుజీత్, వి.వి.వినాయ‌క్ ఈ ప్రాజెక్టు మీద ప‌ని చేశారు. కానీ వాళ్లిద్ద‌రూ చిరు కోరుకున్న‌ట్లుగా స్క్రిప్టు త‌యారు చేయ‌లేక‌పోయారు.

రీమేక్‌లు తీయ‌డంలో మంచి నైపుణ్యం ఉండి, అలాగే ఒరిజిన‌ల్ సినిమాల్లోనూ త‌న‌దైన ముద్ర చూపించిన మోహ‌న్ రాజా.. చిరును త‌న స్క్రిప్టుతో మెప్పించ‌గ‌లిగాడు. ఒరిజిన‌ల్‌తో పోలిస్తే ఇంకొంచెం వినోదాత్మ‌కంగా, క‌మ‌ర్షియ‌ల్ అంశాల క‌ల‌బోతతో సినిమా ఉండాల‌ని చిరు కోరుకున్నారు. రాజా ఆ ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

చిరు సినిమా అన్నాక క‌థానాయిక లేకుంటే చాలా క‌ష్టం. లూసిఫ‌ర్‌లో మోహ‌న్ లాల్‌కు జోడీ ఉండ‌దు. తెలుగులో ఆ పాత్ర‌ను అలాగే చూపిస్తే స‌రిపోద‌ని.. హీరోయిన్, రెండు మూడు పాట‌లు లేకుండా త‌న అభిమానులు ఒప్పుకోర‌ని చిరు బ‌ల‌మైన అభిప్రాయంతో ఉన్నార‌ట‌. రాజా ఆ మేర‌కు కొత్త ఎపిసోడ్ జోడించి హీరోయిన్ పాత్ర‌కు స్కోప్ ఇచ్చార‌ట‌.

ఈ పాత్ర కోసం స‌రైన హీరోయిన్ని ఎంచుకోవాల‌ని చూస్తున్నారు. ఇందుకోసం ఇలియానా పేరు కూడా వినిపిస్తుండ‌టం విశేషం. చిరు వ‌య‌సు సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇలియానా వైపు చూస్తున్నార‌ట‌. హీరోయిన్ ఎపిసోడ్‌తో పాటు కొన్ని కామెడీ, యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను కూడా రీమేక్‌లో చేరుస్తున్న‌ట్లు స‌మాచారం.