టాక్ ఆఫ్ ద టౌన్.. దగ్గుబాటితో ప‌వ‌న్ బాండింగ్

ఒకప్పుడు స్టార్ హీరోలు ఇబ్బడిముబ్బడిగా మ‌ల్టీస్టార‌ర్లు చేసేసేవాళ్లు. కానీ త‌ర్వాత స్టార్ హీరోలు క‌లిసి సినిమాలు చేయ‌డ‌మే అరుదైపోయింది. గ‌త కొన్నేళ్ల‌లో మ‌ళ్లీ కొంచెం మ‌ల్టీస్టార‌ర్ల ఊపు క‌నిపించినా ఒక‌ప్ప‌టి స్థాయిలో మాత్రం లేవు. కొంత విరామం త‌ర్వాత టాలీవుడ్లో చూడ‌బోతున్న మ‌ల్టీస్టార‌ర్ అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేకే. మ‌ల‌యాళంలో బిజు మీన‌న్, పృథ్వీరాజ్ చేసిన పాత్ర‌ల‌ను తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి చేయ‌నున్నారు.

ఒరిజిన‌ల్‌కు పూర్తి భిన్నంగా బిజు లాంటి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ చేసిన పాత్ర‌ను ప‌వ‌న్ చేయ‌బోతుంటే.. పృథ్వీ రాజ్ లాంటి పెద్ద స్టార్ చేసిన పాత్ర‌లో ప‌వ‌న్ ముందు తక్కువ ఇమేజ్ ఉన్న రానా న‌టించ‌నున్నాడు. మాతృక‌తో పోలిస్తే ప‌వ‌న్ చేయ‌నున్న పాత్రకు ఇక్క‌డ బాగా ఎలివేట్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ముందు నుంచి పృథ్వీ పాత్ర‌కు రానా పేరే వినిపిస్తుండ‌గా.. అది ఖ‌రార‌వ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. ప‌వ‌న్ చేస్తున్న పాత్ర‌కు ఇంత‌కుముందు బాల‌కృష్ణ‌, ర‌వితేజ లాంటి పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా ప‌వ‌న్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆయ‌నే ఈ సినిమా చేస్తున్నాడు. ప‌వ‌న్‌తో మ‌ల్టీస్టార‌ర్ చేసే అవ‌కాశం రెండోసారి కూడా ద‌గ్గుబాటి హీరోకే ద‌క్క‌డం ఇక్క‌డ పెద్ద విశేషం. ఇంత‌కుముందు వెంక‌టేష్‌తో క‌లిసి ప‌వ‌న్ గోపాల గోపాల సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ కెరీర్లో అదే తొలి మ‌ల్టీస్టార‌ర్. మ‌ళ్లీ ఇప్పుడు ద‌గ్గుబాటి కుటుంబానికే చెందిన రానాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

ప‌వ‌న్‌తో క‌లిసి న‌టించాల‌ని చాలా మంది హీరోల‌నుకుంటారు. మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల‌కూ ఈ ఆశ ఉంది. కానీ వారికి ద‌క్క‌ని అవ‌కాశాన్ని రానా ద‌క్కించుకోవ‌డం విశేష‌మే.. బ‌హుశా ఇలాంటి అవ‌కాశం మ‌రే యంగ్ హీరోకూ మున్ముందు కూడా ద‌క్కే అవ‌కాశాలు త‌క్కువే కాబ‌ట్టి అత‌డికిది ఒక ప్రివిలేజ్ లాంటిదే.