ఎన్టీఆర్-ప్ర‌శాంత్ నీల్.. ఏమైంది?

కేజీఎఫ్‌-చాప్ట‌ర్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఉంటుంద‌నే అంతా అనుకున్నారు. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా చేసేందుకు మైత్రీ మూవీ మేక‌ర్స్ రంగం సిద్ధం చేయ‌డం తెలిసిన సంగతి తెలిసిందే. దీని గురించి చాలా రోజుల కింద‌టే మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ప్ర‌శాంత్ నీల్ సైతం ఎన్టీఆర్‌తో క‌లిసి సినిమా చేయ‌డం గురించి చాలా ఎగ్జైట్ అవుతూ ట్వీట్ పెట్టాడు.

కానీ అంత‌టితో ఆ వ్య‌వ‌హారం ముగిసిపోయింది. అనూహ్యంగా ప్ర‌భాస్ సినిమాను ముందుకు తెచ్చాడు ప్ర‌శాంత్. కేజీఎఫ్ నిర్మాత‌లు వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో స‌లార్ అనే సినిమాను ప్ర‌క‌టించారు. అది జ‌న‌వ‌రిలోనే సెట్స్ మీదికి కూడా వెళ్ల‌బోతోందంటున్నారు. 2021లోనే రిలీజ్ అని కూడా సంకేతాలు అందుతున్నాయి.

దీంతో ఎన్టీఆర్‌తో ప్ర‌శాత్ సినిమా సంగ‌తేంటనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భాస్ సినిమా ముందుకొచ్చినంత మాత్రాన ఎన్టీఆర్‌తో సినిమా క్యాన్సిల్ అయింద‌ని అనుకోవ‌డానికి లేదు. కానీ ఆ సినిమా ఉంటుంద‌నే సంకేతాలు ఎవ‌రి నుంచీ రావ‌ట్లేదు. స‌లార్ అనౌన్స్‌మెంట్ నేప‌థ్యంలో త‌మ హీరోతో ప్ర‌శాంత్ సినిమా గురించి టెన్ష‌న్ ప‌డుతున్న ఎన్టీఆర్ అభిమానుల‌ను ఊర‌డించే ప్ర‌య‌త్నం ఏమీ జ‌ర‌గ‌ట్లేదు.

స‌లార్ త‌ర్వాత అయినా ప్ర‌శాంత్, ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని మైత్రీ వాళ్ల నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. క‌న్న‌డ స్టార్ల‌ను విడిచిపెట్టి ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డం గురించి ట్రోల్ చేస్తున్న క‌న్న‌డ అభిమానుల‌కు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన ప్ర‌శాంత్.. త‌న‌ను ట్యాగ్ చేసి ఎన్టీఆర్ సినిమా గురించి అడుగుతున్న అత‌డి అభిమానుల‌కు మాత్రం ఏమీ స‌మాధానం ఇవ్వ‌డం లేదు. ఎన్టీఆర్ అయితే దీని గురించి స్పందించే స్థితిలో లేడు. త‌మ‌‌ను టెన్ష‌న్ పెట్ట‌కుండా ఈ సినిమా ఉంటుంద‌ని చిత్ర బృందంలోంచి ఎవ‌రో ఒక‌రు ఏదో ర‌కంగా ఒక‌రు అప్ డేట్ ఇస్తే బాగుండన్న‌ది తార‌క్ అభిమానుల కోరిక‌.