తొలి రోజే కోటి కొల్ల‌గొట్టేసిన‌ ఎం.ఎస్.రాజు

టాలీవుడ్లో ఎం.ఎస్.రాజు పేరు వినిపించి చాలా కాలం అయిపోయింది. ఒక‌ప్పుడు శ‌త్రువు, దేవి, మ‌న‌సంతా నువ్వే, ఒక్క‌డు, వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దానా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందించిన ఈ నిర్మాత‌.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో వెనుక‌బ‌డిపోయాడు. మ‌ధ్య‌లో ద‌ర్శ‌క‌త్వం చేప‌ట్టి సినిమాలు తీసినా అవీ ఫ‌లితాన్నివ్వ‌లేదు. చాలా ఏళ్లుగా ఖాళీగా ఉండిపోయిన రాజు.. రీఎంట్రీకి స‌రైన సినిమానే ఎంచుకున్నాడు.

ఈ కాలంలో యువ‌త‌ను ఆక‌ట్టుకోవాలంటే ఏం కావాలో అదే ఇవ్వ‌డానికి నిర్ణ‌యించుకుని డ‌ర్టీ హ‌రి అనే బోల్డ్ సినిమా తీశాడు. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో క‌థను తీర్చిదిద్దుకుని.. బోలెడ‌న్ని బోల్డ్ సీన్ల‌తో సినిమాను నింపేసి పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో శుక్ర‌వారం ఈ సినిమాను రిలీజ్ చేశాడు రాజు.

ఒక కొత్త ఏటీటీ యాప్‌లో శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 91 వేల వ్యూస్ వ‌చ్చాయి. ఈ చిత్రానికి టికెట్ రేటు 120 రూపాయ‌లు పెట్టారు. అంటే ఒక్క రోజు వ్య‌వ‌ధిలో కోటి రూపాయ‌ల‌కు పైగానే వ‌సూళ్లు వ‌చ్చాయ‌న్న‌మాట‌. సినిమా చూస్తే త‌క్కువ బ‌డ్జెట్లోనే పూర్తి చేసిన‌ట్లే ఉంది. ఆన్ లైన్ రిలీజ్ కాబ‌ట్టి ప‌బ్లిసిటీకి కూడా పెద్ద‌గా ఖ‌ర్చు లేదు. తొలి రోజే బ‌డ్జెట్ కంటే ఎక్కువే వెన‌క్కి వ‌చ్చి ఉంటే ఆశ్చ‌ర్యం లేదు.

ఐతే ఈ సినిమాను రిలీజ్ చేసిన కొత్త ఏటీటీ యాప్ మాత్రం వ్యూయ‌ర్స్‌ను ఏడిపించేసింది. పేమెంట్ చేశాక సినిమా స్ట్రీమ్ కాలేదు. డ‌బ్బులు క‌ట్ అయ్యాయి సినిమా రావ‌ట్లేదంటూ వ్యూయ‌ర్స్ ల‌బోదిబోమ‌న్నారు. యూజ‌ర్లు ఎక్కువైపోవ‌డంతో స‌ర్వ‌ర్లు డౌన్ అయ్యాయ‌ని మెసేజ్‌లు పెట్టారు. శ‌నివారం మ‌ధ్యాహ్నానికి సినిమా ప్లే అయింది కానీ.. తాము కోరుకున్న స‌మ‌యంలో సినిమా చూడ‌లేక‌, మ‌ళ్లీ మ‌ళ్లీ పేమెంట్ చేసి ఇబ్బంది ప‌డ్డ వాళ్లు మాత్రం రాజు మీద, యాప్ నిర్వాహ‌కుల మీద సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం చూపిస్తున్నారు.