సందీప్ రెడ్డి వంగ‌.. అనిమ‌ల్‌

అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం రేపిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌. తొలి సినిమాతోనే దేశ‌వ్యాప్తంగా అత‌డి పేరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అర్జున్ రెడ్డి సౌత్ ఇండ‌స్ట్రీలో ఎంత‌టి ప్ర‌కంప‌న‌లు రేపిందో తెలిసిందే. ఇదే సినిమాను హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే అక్క‌డా సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది.

కానీ అర్జున్ రెడ్డి వ‌చ్చాక మూడేళ్ల త‌ర్వాత కూడా సందీప్ నుంచి ఇంకో కొత్త సినిమా రాక‌పోవ‌డం మాత్రం ఆయ‌న అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేస్తోంది. క‌బీర్ సింగ్ విడుద‌ల‌య్యాక కూడా ఏడాదిన్న‌ర పాటు త‌న కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్ట‌లేదు. హిందీలోనే త‌న మూడో సినిమా చేయాల‌నుకున్నాడు కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది.

సందీప్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని హిందీలోనే, బాలీవుడ్ బ‌డా స్టార్ల‌లో ఒక‌డైన ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా తెర‌కెక్కించ‌నున్న‌ట్లు దాదాపు ఏడాది కింద‌టే వార్త‌లొచ్చాయి. కానీ చిత్రీక‌ర‌ణ మాత్రం ఇంకా మొద‌ల‌వ‌లేదు. ఒక ద‌శ‌లో ఈ కాంబోలో సినిమా క్యాన్సిల్ అని కూడా వార్త‌లొచ్చాయి.

కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సందీప్, ర‌ణ‌బీర్ క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాకు టైటిల్ కూడా ఖ‌రారైందంటూ బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అనిమ‌ల్ అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌తో సందీప్ త‌న త‌ర్వాతి సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఈ టైటిల్‌ను బ‌ట్టి చూస్తే అర్జున్ రెడ్డి త‌ర‌హాలోనే ఇందులోనూ హీరో పాత్ర‌లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి సాఫ్ట్‌గా క‌నిపించే ర‌ణ‌బీర్‌ను జంతువులాగా చూపించాలంటే సందీప్ చాలా క‌ష్ట‌ప‌డాల్సిందే.