బిగ్‍బాస్‍ నుంచి హారిక, అరియానా ఔట్‍!

బిగ్‍బాస్‍ సీజన్‍ 4 అయినా లేడీ కంటెస్టెంట్‍ గెలుస్తుందనే ఆశలెవరికైనా వుండుంటే అవి ఆవిరైనట్టే. టాప్‍ 5లోకి వచ్చిన దేత్తడి హారిక, అరియానా గ్లోరీ ఇద్దరూ టాప్‍ 3లో స్థానం దక్కించుకోలేదని సమాచారం. ఆదివారం ప్రసారమయ్యే ఫినాలేకి శనివారమే షూట్‍ మొదలు పెట్టారు. శనివారం షూట్‍ చేసిన దాంట్లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్‍ అయినది చిత్రీకరించారు. అయిదవ కంటెస్టెంట్‍గా హారిక ఎలిమినేట్‍ అయిందని, నాలుగవ స్థానంలో అరియానా ఎవిక్ట్ అయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

దీంతో ఇంకా బరిలో అభిజీత్‍, సోహెల్‍, అఖిల్‍ మిగిలారు. అయితే అభిజీత్‍కి ఎక్కువ ఓట్లు వచ్చాయని గట్టిగా వినిపిస్తోంది. యూత్‍ ఓట్లు అభిజీత్‍కి ఎక్కువ పోల్‍ కాగా, సోహెల్‍కి మాస్‍ ఓటింగ్‍ బాగా జరిగిందని, ముఖ్యంగా ఫోన్‍ లైన్స్ ద్వారా సోహెల్‍కి గట్టిగా ఓట్లు వేసారని సమాచారం. ఒకవేళ అఖిల్‍ కనుక టాప్‍ 5లో లేకపోతే అతడి ఓట్లు కూడా సోహెల్‍కే పడి వుండేవి. ఇద్దరు బలమైన కంటెస్టెంట్లు, పైగా స్నేహితులు బరిలో వుండడంతో ఓట్లు చీలిపోయాయి.

గత సీజన్లో వరుణ్‍ సందేశ్‍ విషయంలో ఇదే జరిగింది. అతడి భార్య వితిక కూడా టాప్‍ 5లో వుండడం వల్ల వరుణ్‍ గెలవలేకపోయాడు. ఇక వుమన్‍ కార్డు వాడి ఈసారి లేడీ గెలవాలంటూ డ్రామా చేసిన అరియానా ఎక్కువ మందిని తన జిత్తులతో మాయ చేయలేకపోయింది. అయితే ఈ షో ముందు పెద్దగా ఎవరికీ తెలియను కూడా తెలియని ఆమె టాప్‍ 5 వరకు చేరడం మాత్రం గొప్ప అఛీవ్‍మెంటే అనాలి.