రక్తం నుండి రొమాన్స్ కు షిఫ్ట్ కొట్టిన శైలేష్

‘హిట్’ ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను. కంటెంట్‌లో ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే.. ‘హిట్’ను మించి ‘హిట్-2’, ‘హిట్-2’ను మించి ‘హిట్-3’ వసూళ్లు రాబట్టి శైలేష్‌ను స్టార్ డైరెక్టర్ చేశాయి. ఐతే మధ్యలో అతను ఈ ఫ్రాంఛైజీని వదిలేసి ‘సైంధవ్’ అనే సినిమా చేశాడు. కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది.

దీంతో ‘హిట్’ ఫ్రాంఛైజీ తప్ప శైలేష్‌కు ఇంకేదీ సూట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే అతనిప్పుడు తన శైలికి పూర్తి భిన్నమైన సినిమాకు రెడీ అయ్యాడు. కెరీర్లో తొలిసారిగా ఒక ఫుల్ లెంత్ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు శైలేష్. ఇటీవలే ‘ఛాంపియన్’తో పలకరించిన యంగ్ హీరో రోషన్ మేక ఇందులో హీరో. ‘కన్నప్ప’లో కథానాయికగా నటించిన మలయాళ అమ్మాయి ప్రీతి ముకుందన్.. రోషన్ సరసన నటిస్తోంది.

నేరుగా ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమా గురించి అనౌన్స్‌‌మెంట్ ఇచ్చింది టీం. ‘ఏమో ఏమో ఇది’ అంటూ ఒక పొయెటిక్ టైటిల్ ఈ చిత్రానికి పెట్టాడు శైలేష్. ఆ టైటిల్‌కు తగ్గట్లే ఆహ్లాదకరంగా గ్లింప్స్‌ను తీర్చిదిద్దాడు.

ఒక కాఫీ షాప్‌లో తల్లితో కలిసి కాఫీ తాగుతూ.. ఈ తరం అమ్మాయిలు ఎంత ప్రమాదకరంగా ఉన్నారో చెప్పే హీరో.. తన కోసం దేవుడు ఏం రాసి ఉన్నాడో చూద్దాం అనడం.. అంతలో కథానాయిక పరిచయం.. ఆమెను చూసి మైమరచిపోయిన హీరో తనే ఆ కాఫీ షాప్ యజమాని అని తెలుసుకోవడం.. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమకథ ఎలా మొదలై, ముందుకు సాగిందో సినిమాలోనే చూసుకోవాలన్నట్లుగా హింట్ ఇవ్వడం.. ఇలా గ్లింప్స్ ఆద్యంతం ప్లెజెంట్‌‌గా సాగింది.

రోషన్, ప్రీతి మంచి జంట అవుతుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. హేషమ్ అబ్దుల్ బీజీఎం గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణ. వంశీ పుచ్చుపులుసు విజువల్స్ కూడా అదిరిపోయాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.