రాజా సాబ్ ఫలితం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే కానీ రాబోయే ప్రభాస్ సినిమాలు చాలా ప్రామిసింగ్ గా ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు. అధిక శాతం అభిమానుల దృష్టి స్పిరిట్ మీద ఉంది కానీ ఆల్రెడీ సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఫౌజీ మీద అంతగా ఫోకస్ పెట్టడం లేదు. కారణం సింపుల్.
ఇప్పటిదాకా ఈ టీమ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇంకెలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రాలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా నేపథ్యం స్వాతంత్రం రాక ముందు ఇండియాలో ఉన్న పరిస్థితుల మీద సాగుతుంది. వార్, ఎమోషన్స్ రెండూ ఉంటాయట.
అయితే విడుదల తేదీకి సంబంధించి ఇప్పటిదాకా మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దసరా లేదా దీపావళిని టార్గెట్ గా పెట్టుకుంటున్నారట. ఓటిటి డీల్ ఇంకా అవ్వలేదని టాక్. ఇటీవలే విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్ లిస్టులో ఈ మూవీ లేదు.
ఒకవేళ ప్రైమ్, హాట్ స్టార్ లో ఎవరైనా దక్కించుకుంటారేమో ఇంకా తెలియాల్సి ఉంది. స్పిరిట్ వచ్చే ఏడాది మార్చిలో వస్తుంది కాబట్టి దానికన్నా కనీసం ఆరు నెలల ముందు ఫౌజీ రావాలి. లేదంటే 2027 సమ్మర్ కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే పెట్టుబడి పరంగా మైత్రికి కొంచెం భారం అవుతుంది.
ఒకవైపు కల్కి 2 షూటింగ్ ప్రారంభం కాబోతోందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఫౌజీ గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే చాలా ఉంది. ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. కాకపోతే సినిమా ఎంత గ్రాండియర్ గా ఉందో ఆడియన్స్ కి అర్థం కావాలంటే కొన్ని విజువల్స్ ని టీజర్ రూపంలో వదలాలి.
దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటిదాకా జరిగిన షూట్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నారట. స్పిరిట్ తో పాటు ప్రభాస్ దీనికీ డేట్లు ఇస్తున్న నేపథ్యంలో జూలై లేదా ఆగస్ట్ కల్లా గుమ్మడికాయ కొట్టేస్తే ఫౌజీ దర్శనం ఈ సంవత్సరమే ఉంటుంది. చూడాలి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates