ఆటవిక రాజ్యంలో ‘స్వయంభు’ సమరం

కార్తికేయ 2తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న నిఖిల్ ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు చవి చూశాడు కానీ మళ్ళీ బలంగా కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్వయంభు కోసం చాలా కష్టపడ్డాడు. ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు ఫిజీకల్ గా కూడా ఎంతో శ్రమ తీసుకుని రెండేళ్లకు పైగా ఈ ప్రాజెక్టు మీదే ఉన్నాడు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎపిక్ డ్రామా వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 10 ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం ఆ డేట్ ఖరారు చేయలేదు. తాజాగా రెండు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ రూపంలో స్వయంభులో ఎలాంటి కంటెంట్ ఉండబోతోందో చూపించారు.

ఇది శతాబ్దాల వెనుకటి కథ. అగాథంలో చిక్కుకున్న ఒక రాజ్యంలో రాముడికి శివుడు ఇచ్చిన ఆయుధం సైతం ప్రమాదంలో ఉంది. అరాచకం సింహాసనం మీద కూచుని ప్రజల మానప్రాణాలతో ఆడుకుంటూ ఉంటుంది. రక్షకుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో స్వయంభు (నిఖిల్ సిద్దార్థ) వస్తాడు.

ప్రమాదమైనా ప్రమోదమైనా ముందుండి నడిపించే ఆ యువకుడు ప్రాణాలకు పణంగా పెట్టి పరిస్థితులకు ఎదురీదుతాడు. అయితే సవాళ్లు ఎదురవుతాయి. అసలు అతని రాక వెనుక రహస్యం ఏమిటి, రక్తం ఏరులై పారేంత రహస్యాలు ఆ రాజ్యంలో ఏమున్నాయో తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద చూడాలి.

విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. బాహుబలి తరహా టేకింగ్ తో దర్శకుడు భరత్ కృష్ణమాచారి పూర్తిగా మరో లోకంలో విహరింపజేయబోతున్నారు. కళ్లుచెదిరే ఆర్ట్ వర్క్ కు తోడుగా రవి బస్రూర్ సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి.

జానపద గాథని చందమామ కథలా చెప్పే ప్రయత్నం పిల్లా పెద్దని ఆకట్టుకునేలా ఉంది. విజువల్ గ్రాండియర్ గా రూపొందుతున్న స్వయంభులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లు కాగా సునీల్, సత్య తదితరులు ఇతర తారాగణం. ట్రైలర్ చూపించిన కంటెంటే సినిమాలోనూ ఉంటే నిఖిల్ కష్టానికి తగ్గ ఫలితం దొరికినట్టే.