నెల రోజుల నుంచి వాయిదాల పర్వంలో ఉన్న విజయ్ జన నాయకుడు ఎట్టకేలకు రాజీ మార్గం పట్టొచ్చని చెన్నై వర్గాల కథనం. సిబిఎఫ్సి మీద నిర్మాత కేసు విత్ డ్రా చేసుకోవడం ద్వారా రివైజింగ్ కమిటీ నుంచి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అధికారులు చెప్పిన మార్పులకు వీలైనంత అంగీకరించి రిలీజ్ కు మార్గం సుగమం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒకపక్క బయ్యర్ల నుంచి ఒత్తిడి అంతకంతా ఎక్కువవుతోంది. వచ్చే నెల మార్చి 19 ఇదే కెవిఎన్ సంస్థ నిర్మించిన టాక్సిక్ పెద్దఎత్తున విడుదలవుతుండటంతో ముందు జన నాయకుడు క్లియర్ కావడం చాలా అవసరం.
వీలైనంత వరకు జన నాయకుడుని ఫిబ్రవరి మూడో వారంలోనే థియేటర్లకు తీసుకురావాలని చూస్తున్నారట. అయితే సర్టిఫికెట్ చేతికి రానిదే అనౌన్స్ మెంట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దీని కోసమే ఎదురు చూస్తున్న ఇతర నిర్మాతలు తమ రిలీజ్ డేట్లను పెండింగ్ లో పెట్టేశారు.
విజయ్ అభిమానులు ఒక్కసారి అధికారిక ప్రకటన వస్తే సంక్రాంతికి మించి సెలెబ్రేషన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ ఉద్దేశాలతోనే జన నాయకుడుని అడ్డుకుంటున్నారని, వాటికి కలెక్షన్ల రూపంలో సమాధానం ఇస్తామని నొక్కి చెబుతున్నారు. ట్రైలర్ ఆల్రెడీ పాతదై పోయింది కాబట్టి మరో వెర్షన్ రెడీ చేస్తున్నారట.
ఒక సానుకూలాంశం ఏమిటంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగడం. ఒకవేళ సంక్రాంతికి వచ్చి ఉంటే చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, ప్రభాస్ కాంపిటీషన్ తట్టుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడా సమస్య లేదు.
భగవంత్ కేసరి రీమేక్ అని తెలిసినా సరే కీలక మార్పులు చేశారనే టాక్ బలంగా ఉండటం వల్ల ఇక్కడి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ విజయ్ చివరి మూవీ కావడంతో రెవిన్యూ బాగానే రావొచ్చు. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడులో బాబీ డియోల్ విలన్ గా మమిత బైజు, పూజా హెగ్డే కీలక తారాగణంలో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates