సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా నిర్మాతగా పూర్తి స్థాయిలో ఒక్క సినిమా కూడా చేసింది లేదు. తాను హీరోగా నటించిన సినిమాల్లో బేనర్ పేరు వేసుకుని పారితోషకం బదులు వాటా తీసుకోవడం జరిగింది కానీ.. ప్రొడక్షన్ బాధ్యతంతా తీసుకున్నది లేదు. తొలిసారి అతను పూర్తి స్థాయి నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. తన ప్రొడక్షన్లో సొంతంగా కూడా సినిమా చేయని మహేష్.. ఇలా బయటి హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం విశేషమే.
మరి ఇంత ప్రత్యేకమైన సినిమా విషయంలో మహేష్ చాలా శ్రద్ధ పెట్టి ఉంటాడని.. స్క్రిప్టు విని పూర్తిగా సంతృప్తి చెందాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడని అనుకుంటాం. కానీ ‘మేజర్’ సినిమాకు సంబంధించి అసలు కథ కూడా వినకుండానే మహేష్ ప్రొడక్షన్కు రెడీ అయిపోయాడట. సినిమా పూర్తి కావస్తుండగా.. ఇప్పటికీ మహేష్ ఈ సినిమా కథ వినలేదట. ఈ విషయాన్ని స్వయంగా కథానాయకుడు అడివి శేషే వెల్లడించాడు.
గురువారం అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా ‘మేజర్’ ఫస్ట్ లుక్ రిలీజవడం, దానికి మంచి స్పందన రావడం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్ అసలు ‘మేజర్’ కథే వినని విషయాన్ని వెల్లడించాడు శేష్. ‘‘మహేష్, నమ్ర్తత గారికి నా మీద, నా టీం మీద అపారమైన నమ్మకం పెట్టారు. దీంతో అత్యుత్తమమైన సినిమా అందించాల్సిన బాధ్యత నాపై ఇంకా పెరిగింది. నేను నమ్రత గారికి మాత్రమే స్క్రిప్టు చెప్పాను. మహేష్ గారు కనీసం కథ కూడా వినకుండానే సినిమాకు ఓకే చెప్పేశారు. ప్రొడక్షన్కు సంబంధించి మాకు ఏం కావాలంటే అది అందించారు. మనం ఒక గొప్ప సినిమాను చేస్తున్నాం అంటూ నమ్రతగారు నన్ను ప్రోత్సహించారు’’ అని శేష్ తెలిపాడు.
2008 ముంబయి దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’కు ‘గూఢచారి’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.