తిరిగి తిరిగి మళ్లీ అక్కినేని గూటికే?

కళ్యాణ్ కృష్ణ కురసాల.. తొలి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’తో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు. వైకాపా నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడే ఇతను. ఐతే ఇలాంటి గుర్తింపులు సినీ రంగంలో పరిచయాల వరకు ఉపయోగపడతాయి కానీ.. సినిమా చేసే అవకాశం అందించేది ప్రతిభే. కళ్యాణ్ తన తొలి సినిమాలో బాగానే టాలెంట్ చూపించాడు. నాగార్జునకు చాలా ఏళ్ల తర్వాత పెద్ద హిట్ ఇచ్చాడు.

ఆ సినిమా వచ్చి పదేళ్లు గడిచిపోగా.. ఇప్పటికీ నాగార్జునకు అదే పెద్ద హిట్ కావడం గమనార్హం. ‘సోగ్గాడే..’ తర్వాత తన రెండో సినిమాను కూడా అక్కినేని కాంపౌండ్లోనే చేశాడు కళ్యాణ్. నాగచైతన్యతో అతను రూపొందించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా హిట్టయింది. కానీ తర్వాత అక్కినేని కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి మాస్ రాజా రవితేజతో ‘నేల టిక్కెట్టు’ తీశాడు. అది పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో తిరిగి అక్కినేని వారి దగ్గరికే చేరాడు.

ఐతే కళ్యాణ్ ఇంకో సినిమా చేయడానికి చాలా టైమే పట్టింది. ‘బంగార్రాజు’ను నాగ్ అంత తేలిగ్గా ఓకే చేయలేదు. తనకు, తన కొడుక్కి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన కళ్యాణ్‌ను నాగ్ సరిగా ట్రీట్ చేయట్లేదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే చాలా ఏళ్ల కసరత్తు తర్వాతే అది ముందుకు కదిలింది. 2022 సంక్రాంతికి రిలీజైన ఆ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.

ఆ తర్వాత కళ్యాణ్ మళ్లీ బయటికి వెళ్లి ఓ సినిమా చేయాలని చూశాడు. చిరుతో ‘బ్రో డాడీ’ రీమేక్‌ చేసే విషయమై చాలా రోజులు సంప్రదింపులు జరిగాయి. తన టీంతో స్క్రిప్టు కూడా రెడీ చేశాడు. కానీ ఏవో కారణాలతో అది ముందుకు కదల్లేదు.
తర్వాత కళ్యాణ్ గురించి ఇండస్ట్రీలో డిస్కషనే లేదు. తీసిన నాలుగు చిత్రాల్లో మూడు సక్సెస్ అయినా.. కళ్యాణ్‌కు ఈ పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించింది.

ఇక అందరూ కళ్యాణ్‌ను మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు ‘సోగ్గాడే..’, ‘బంగార్రాజు’ లైన్లోనే ‘వాసివాడి తస్సాదియ్యా’ సినిమాను అనౌన్స్ చేసింది అన్నపూర్ణ సంస్థ. నాగ్, చైతూల కలయికలో కళ్యాణే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ దర్శకత్వ బాధ్యతలు అతనికే అనడంలో ఎటువంటి అనుమానాలు లేవంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

మొత్తానికి కళ్యాణ్‌ కెరీర్‌‌కు మళ్లీ నాగార్జునే పుష్ ఇవ్వబోతున్నాడన్నమాట. కలిసొచ్చిన కాంపౌండ్లో మళ్లీ ఒక హిట్టు కొట్టి కళ్యాణ్ తన ఉనికిని చాటుకుంటాడేమో చూద్దాం.