కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ రేంజ్ అంచనాలు ఉండేవి. అన్నయ్య కొడుకుతో ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుందామని ఆశ పడిన నిర్మాత నాగబాబు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ని నమ్మి భారీ బడ్జెట్ ని మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు.
రిలీజ్ కు ముందే హరీష్ జైరాజ్ పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. క్రేజీ కాంబినేషన్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ భారీ నమ్మకం పెట్టుకున్నారు. కట్ చేస్తే విడుదల తర్వాత సీన్ మారిపోయింది. జనాలకు ఆరెంజ్ నచ్చలేదు. కనీసం యావరేజ్ అయినా బాగుండేది కానీ డిజాస్టర్ దెబ్బకు నాగబాబుకి భారీ నష్టాలు మిగిలాయి.
కాలక్రమేణా హోమ్ వీడియో, శాటిలైట్ ఛానల్స్ లో ఆరెంజ్ కు ఆదరణ పెరగడం మొదలయ్యింది. ముఖ్యంగా యూత్ లో ఒక కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది. అప్పుడు సరిగా అర్థం చేసుకోలేకపోయామంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు షురూ చేశారు. మొన్నటి ఏడాది రీ రిలీజ్ చేస్తే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్లకు అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా పొలోమంటూ పరుగులు పెట్టారు. కొన్ని చోట్ల రికార్డులు కూడా వచ్చాయి. తర్వాత కొన్ని నెలలయ్యాక మరోసారి లిమిటెడ్ రీ రిలీజ్ చేశారు. అప్పుడూ బాగానే చూశారు. ఇప్పుడు ఫిబ్రవరి 7 మరోసారి ఆరెంజ్ దర్శనం థియేటర్లలో జరగనుంది.
విచిత్రం ఏమిటంటే ఇంత తక్కువ గ్యాప్ లో రీ రిలీజ్ చేస్తున్నా క్రేజ్ అలాగే ఉండటం. హైదరాబాద్ లో ఉదయం ఎనిమిది గంటలలోపు షోలు వేస్తున్న మల్లికార్జున, శ్రీరాములు, భ్రమరాంబ, అర్జున్, గోకుల్, సంధ్య కాంప్లెక్స్ మొదలైన సింగల్ స్క్రీన్ల టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. వైజాగ్, విజయవాడలోనూ ఇంచుమించు ఇదే తరహా రెస్పాన్స్ ఎర్లీ మార్నింగ్ షోలకు ఉంది.
ఇన్నిసార్లు ఇప్పుడు ఎగబడి చూసే బదులు అసలు విడుదల టైంలోనే చూసి ఉంటే నాగబాబు గట్టెక్కేవారు. ఏంటో కొన్నిసార్లు ట్రెండ్ అంతే. అంతుచిక్కని రీతిలో ఉంటుంది. అనూహ్య ఫలితాలు ఇస్తుంది. ఆరెంజే ఉదాహరణగా నిలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates