నైజాం వద్ద దిల్ రాజు సైలెంట్

టాలీవుడ్‌లో నైజాం డిస్ట్రిబ్యూషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు దిల్ రాజు. దశాబ్దాలుగా ఈ ఏరియాలో ఆయన ఒక తిరుగులేని పంపిణీదారుడిగా కొనసాగుతున్నారు. ఏదైనా సినిమాకు బజ్ ఉంటే రిస్క్ చేసి మరీ అధిక ధరలకు కొనే సాహసం ఆయన సొంతం. అయితే తాజాగా నైజాం ఏరియాలో రాబోయే భారీ సినిమాల జాబితా చూస్తుంటే దిల్ రాజు పేరు ఎక్కడా వినిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 

ఫంకీ, ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, ఫౌజీ వంటి మేజర్ ప్రాజెక్టులన్నీ ఇతర బ్యానర్ల చేతుల్లోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియోస్’ పంపిణీ రంగంలో మరింత బిజీ అవ్వడం, మైత్రీ మూవీ మేకర్స్ తమ సొంత నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడం దిల్ రాజుకు గట్టి పోటీని ఇస్తోంది.

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి హిట్ సినిమాలను రిలీజ్ చేసినప్పటికీ, ఆ తర్వాత రాబోయే భారీ లైనప్‌లో ఆయన పంపిణీ చేసే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతో దిల్ రాజుకు ఆర్థికపరమైన విభేదాలు లేదా డీల్స్ కుదరకపోవడమే దీనికి కారణమని ఒక వర్గం టాక్.

నిజానికి దిల్ రాజుకు డిస్ట్రిబ్యూషన్‌లో అపారమైన అనుభవం ఉంది. సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంటే ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ అనుమానం ఉంటే మాత్రం సేఫ్ జోన్ లోనే పంపిణీ చేయడానికి మొగ్గు చూపుతారు. ఇప్పుడు రాబోయే సినిమాల రేట్లు భారీగా ఉండటం, బాక్సాఫీస్ వద్ద రిస్క్ ఎక్కువగా ఉండటంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. లేదంటే ఆయా సినిమాల కంటెంట్ పై ఆయనకు పూర్తి స్థాయిలో నమ్మకం కలగలేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు దిల్ రాజు ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కంటే ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. విజయ్ దేవరకొండ రౌడి జనార్దన్, వేణు ఎల్దండి ఎల్లమ్మ వంటి క్రేజీ కాంబినేషన్లతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు. కొంత కాలం ఇతర సినిమాలను కొనే కంటే తన సొంత సినిమాలను పక్కాగా రిలీజ్ చేసుకోవడం మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజు గారు మళ్ళీ తన పాత స్పీడ్ తో ఎప్పుడు క్రేజీ డీల్స్ పట్టేస్తారో అని ట్రేడ్ వర్గాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.