ఆ హీరోకు 80 కోట్లా?

నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ.. అవి కన్నడ భాష వరకే పరిమితం అయ్యాయి. కానీ 2022లో అతను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార’ సినిమా మొత్తం కథను మార్చేసింది.

కన్నడలో రెండు వారాలు సెన్సేషన్ క్రియేట్ చేశాక తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి అనువాదమై వచ్చిన ఆ చిత్రం.. ఆయా భాషల్లోనూ అద్భుత స్పందన తెచ్చుకుంది. రిషబ్‌కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. ‘కాంతార’కు కొనసాగింపుగా గత ఏడాది దసరాకు రిలీజైన ‘కాంతార: చాప్టర్-1’ ఇంకా పెద్ద విజయం సాధించడం, ఏకంగా 800 కోట్ల మేర వసూళ్లు రాబట్టడంతో పాన్ ఇండియా స్థాయిలో రిషబ్ పేరు మార్మోగింది. తన మార్కెట్ మరింత విస్తరించింది.

ఇప్పుడు తన కొత్త చిత్రాలను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు రిషబ్. తెలుగులో ‘జై హనుమాన్‌’తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఒక భారీ చిత్రం చేయాల్సి ఉంది రిషబ్. అలాగే హిందీలో ఛత్రపతి శివాజీ మీద తీయబోయే సినిమాలో నటించాల్సి ఉంది. ఐతే ఇప్పుడు ఒక్కో సినిమాకు రిషబ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నాడట.

‘కాంతార: చాప్టర్-1’ సాధించిన విజయం చూశాక రెమ్యూనరేషన్ విషయంలో రిషబ్ తగ్గట్లేదట. అసాధారణ స్థాయిలో విస్తరించిన తన మార్కెట్‌కు తగ్గట్లే పారితోషకం అడుగుతున్నాడట. నిర్మాతలు కూడా ఆ మేర అతడికి ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ‘జై హనుమాన్’ షూట్ ఆరంభమవుతుందని.. తర్వాత కొంచెం గ్యాప్‌లో సితార వారి సినిమాను కూడా మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలోపు ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేయాలని రిషబ్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తోంది. వీటి తర్వాతే శివాజీ సినిమా చేస్తాడట. ఆ తర్వాత మళ్లీ ‘కాంతార’ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాను రిషబ్ పట్టాలెక్కించే అవకాశాలు లేకపోలేదు.