తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు. కోర్టులో పోరాడుతున్నారు. మ్యూజిక్ కంపెనీలతో కూడా ఆయనకు వివాదాలు నడుస్తున్నాయి. పాట మీద తొలి హక్కు తనదే అన్నది ఇళయరాజా వాదన.
ఎవరైనా తన పాటలు వాడుకుంటే ముందు తన అనుమతి అడగాలని, రాయల్టీ కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఐతే తమకు ఇలా డబ్బులు చెల్లించకపోయినా పర్వలేదు.. కనీసం అనుమతి అడగరా, క్రెడిట్ ఇవ్వరా అంటూ తీవ్ర ఆగ్రహం, ఆవేదన స్వరంతో మాట్లాడారు టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కోటి.
ఆయన ‘హలో బ్రదర్’ సినిమా కోసం స్వరపరిచిన ‘కన్నె పెట్టరో’ పాటను ఇటీవల ‘డెకాయిట్’ సినిమా టీజర్ కోసం వాడుకున్నారు. ఇది అన్నపూర్ణ స్టూడియో ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం.
ఐతే ఈ పాట వాడుకున్న అన్నపూర్ణ వారు.. కేవలం మ్యూజిక్ సంస్థ, నిర్మాతల దగ్గర అనుమతి తీసుకున్నారే తప్ప.. మాట వరసకు కూడా తనకు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను అడగడం కానీ, ఒరిజినల్ పాట కంపోజ్ చేసిన తన గురించి ప్రస్తావించడం కానీ చేయలేదన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా రేయింబవళ్లు కష్టపడి పాట కంపోజ్ చేసిన తమకు ఎలాంటి క్రెడిట్ రాకపోవడం ఏంటని.. పాటలకు సంబంధించి సంగీత దర్శకులకు ఎలాంటి రైట్స్ లేకుండా నిర్మాతలు ఆడియో హక్కులను అమ్ముకుంటూ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారని.. చివరికి తమ పాటలను తాము రీమిక్స్ చేయాలన్నా రూ.5-10 లక్షలకు ఆడియో సంస్థలకు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చాలామంది ఫిలిం మేకర్స్ తమ పాటలను రీమిక్స్ చేస్తున్నారని.. కేవలం ఆడియో కంపెనీలకు డబ్బులు కట్టి ఆ పని చేస్తున్నారు తప్ప.. తమను మాత్రం అనుమతి అడగట్లేదని ఆయనన్నారు. తాము దాని కోసం డబ్బులు అడగమని, కానీ కర్టసీ కోసం ఒక మాట అడగరా.. అడిగితే తాము కాదంటామా అని ఆయన ప్రశ్నించారు.
దిల్ రాజు ఒక పాట వాడుకున్నందుకు కృతజ్ఞత చూపించారని.. కానీ చాలామంది సంగీత దర్శకుడికి వాల్యూ ఇవ్వట్లేదన్నారు. తాను బఫూన్‌లా కనిపిస్తున్నానా.. ఎవ్వడైనా తాట తీస్తా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates