‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా మెప్పించి.. ఆయన మీద అంచనాలు పెంచుకునేలా చేసింది. స్వయంగా జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాడంటే.. ఆయన స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 

ఆ అంచనాలను అందుకునేలా తన కొత్త చిత్రం ‘వారణాసి’ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే.. రాజమౌళి మరో అద్భుతమైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించబోతున్నాడని అర్థమైంది. ఈ చిత్రాన్ని 2027 వేసవికి రిలీజ్ చేస్తామని ఆ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐతే రాజమౌళి ఎప్పుడూ చెప్పిన సమయానికి తన చిత్రాలను రిలీజ్ చేయడనే పేరుంది. ఆలస్యం అనివార్యం అవుతుంటుంది. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌లో సాగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసినట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 7 ఆ డేట్ అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం. తాజాగా వారణాసిలో వెలసిన పోస్టర్లు ఈ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి. 

In Theatres, 7 April 2027 అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రెడీ చేసి నగర వ్యాప్తంగా పెట్టారు. అంతకుమించి వివరాలు ఏమీ లేవు. ఐతే ఆ పోస్టర్ల డిజైనింగ్ చూస్తే ‘వారణాసి’ని గుర్తుకు తెచ్చేలాగే ఉన్నాయి. ఇది ‘వారణాసి’కి సంబంధించిన పోస్టర్లే అని.. అందుకే వారణాసిలో వీటిని పెట్టించారని.. ఇది కూడా రాజమౌళి మార్కు ప్రమోషనే అని అంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.