దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఒక సినిమా కోసం ఎన్ని వందల మంది కష్టపడినప్పటికీ.. అది హిట్టయినా, ఫ్లాపైనా మేజర్ క్రెడిట్ దర్శకుడి ఖాతాలోకే వెళ్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హిట్టయినా దర్శకుడికి క్రెడిట్ రాని పరిస్థితి ఉంటుంది. ఈ సంక్రాంతికి రిలీజైన ‘అనగనగా ఒక రాజు’ సినిమా విషయంలో అదే జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే సూపర్ హిట్టే.
చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ పోటీని కూడా తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. సంక్రాంతి టైంలో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ ఓ మాదిరిగా ఆడుతోంది. నవీన్ పొలిశెట్టి కెరీర్లో ఇదే తొలి వంద కోట్ల సినిమా కావడం విశేషం.
ఐతే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా నవీన్ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఈ సినిమా దర్శకుడి పేరు.. మారి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లలో ఎక్కడా అతను కనిపించలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం తళుక్కుమన్నాడు. కానీ ఎక్కువ హైలైట్ కాలేదు.
విడుదల తర్వాత కూడా దర్శకుడి గురించి చర్చే లేదు. మారి అనే పేరును బట్టే అతను తమిళుడని అర్థమవుతుంది. ఎవరో తనను నవీన్‌కు పరిచయం చేశారు. అతణ్ని ఈ సినిమాకు దర్శకుడిగా పెట్టుకున్నాడు. ఐతే ‘అనగనగా ఒక రాజు’కు నవీన్ హీరో మాత్రమే కాదు.. స్క్రిప్టు రైటర్ కూడా. చిన్మయి ఘాట్రాజు అనే యాక్టర్ టర్న్డ్ రైటర్‌తో కలిసి నవీన్ స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు రాశాడు. అంతే కాక చిన్మయికి క్రియేటివ్ డైరెక్టర్ అంటూ ఇంకో క్రెడిట్ కూడా ఇచ్చారు.
నవీన్, చిన్మయి సినిమా మేకింగ్‌లో కూడా అన్నీ తామై వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకే దర్శకుడికి క్రెడిట్ రాలేదనిపిస్తుంది. నవీన్ ప్రతిభ ఏంటో అందరికీ తెలిసిందే. అతను స్వతహాగా రైటర్ కూడా. సినిమా మేకింగ్ మీదా గ్రిప్ ఉంది.
తన గత చిత్రాల రైటింగ్, మేకింగ్‌లోనూ అతను బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. ‘అనగనగా ఒక రాజు’ విషయంలో అన్నీ తానై వ్యవహరించాడు. సినిమాలో అతడి పెర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. దీంతో ఈ సక్సెస్ క్రెడిట్ అతడి ఖాతాలోకే వెళ్లింది. దర్శకుడికి ఏమాత్రం పేరు రాలేదు. సినిమా హిట్టయినా అతడికి మరో అవకాశం దక్కుతుందా అన్నది అనుమానమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates