హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా ఇది. రుద్రమదేవిలో కీలక పాత్ర చేసిన రానా దగ్గుబాటిని లీడ్ రోల్ కోసం ఎంచుకుని సురేష్ బాబు నిర్మాణంలో భారీ బడ్జెట్లో ఈ సినిమా తీయాలనుకున్నాడు గుణ. ఇందుకోసం కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేశాడు. ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలూ నడిచాయి. కానీ ఏవో కారణాలతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపి ‘శాకుంతలం’ సినిమా తీశాడు గుణ. ఐతే ఆ సినిమా ఫ్లాప్ అయింది.
దాని తర్వాత గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సొంతంగా ‘హిరణ్య కశ్యప’ తీయడానికి రెడీ అయిపోయారు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్రివిక్రమ్ రైటర్ కాగా.. దర్శకుడెవరన్నది అప్పుడు ప్రకటించలేదు. తనను కాదని వేరుగా సురేష్ బాబు హిరణ్యకశ్యప తీయాలనుకోవడం పట్ల గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు కూడా.
ఐతే తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కూడా ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. మరోవైపు గుణశేఖర్ తీయాలనుకున్న హిరణ్య కశ్యప సినిమా ఏమైందో తెలియదు. ఇప్పుడాయన యుఫోరియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హిరణ్య కశ్యప విషయంలో గుణశేఖర్ కొత్త ఆలోచనను బయటపెట్టాడు. 33 ఏళ్ల తన కెరీర్లో హిరణ్య కశ్యప కోసం ఏడెనిమిదేళ్ల పాటు సమయం వృథా చేశానన్నాడు గుణ. తీయని సినిమా కోసం ఇన్నేళ్లు వెచ్చించడం పట్ల ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఐతే ఇటీవల తనకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చిందని.. సరికొత్త టెక్నాలజీ, కొత్త తరహా కథనంతో భారీ ఎత్తున ఈ ప్రాజెక్టును చేయాలనుకుంటున్నానని గుణ తెలిపాడు. హిరణ్య కశ్యపతో దీనికి సంబంధం లేదా అని అడిగితే.. ఆ కథనే ఇంకో రకంగా చెప్పాలన్నది తన ఉద్దేశమన్నాడు గుణ. ఈ ప్రాజెక్టు చేయడం కోసమే హిరణ్య కశ్యపను ముందు అనుకున్నట్లుగా చేయలేకపోయానేమో అన్నాడాయన. దీనికి భారీ వ్యయం, సాంకేతికత అవసరమని.. అవన్నీ సమకూరాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని గుణ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates