50 కోట్ల నష్టం నుండి 50 కోట్ల లాభం వరకు!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి ఫలితం అటు ఇటు అయినా, కమ్ బ్యాక్ ఇస్తే మాత్రం రికార్డులు తిరగరాయాల్సిందే. గత చిత్రం ‘భోళా శంకర్’ సుమారు 50 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అయితే ఆ నష్టాన్ని సరిగ్గా అదే నంబర్‌తో భర్తీ చేస్తూ చిరంజీవి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తన అసలు విశ్వరూపం చూపిస్తున్నారు.

నిజానికి భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ సంక్రాంతికి రావాల్సింది. కానీ మెగాస్టార్ ‘విశ్వంభర’ విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మరింత టైమ్ కావాలని భావించి ఆ సినిమాను వాయిదా వేశారు. సరిగ్గా అదే గ్యాప్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రాజెక్టును లైన్‌లోకి తెచ్చారు. సంక్రాంతి సీజన్‌ను మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చాలా స్పీడ్‌గా ఈ సినిమాను పూర్తి చేసి థియేటర్లలోకి వదిలారు.

మెగాస్టార్ తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు మాస్టర్ స్ట్రోక్‌గా మారింది. కేవలం రెండు వారల్లోనే టోటల్ లెక్క 300 కోట్లను దాటినట్లు చెబుతున్నారు. థియేట్రికల్ ట్రేడ్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు 50 కోట్లకు లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఇక్కడ రెండు సినిమాల ప్రొడ్యూసర్లు వేరుకోండి, అది వేరే విషయం. గత సినిమా వల్ల వచ్చిన నష్టాన్ని ఈ సినిమా లాభాలతో సరిగ్గా బ్యాలెన్స్ చేయడం చూస్తుంటే బాస్ ఈజ్ బ్యాక్ అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు, మెగాస్టార్ వింటేజ్ మేనరిజమ్స్ తోడవ్వడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అయ్యింది. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఈ సినిమా పక్కాగా క్యాష్ చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఎలాంటి హై వోల్టేజ్ యాక్షన్ కాకుండా, కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్ముకుని చిరంజీవి సాధించిన ఈ సక్సెస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ‘మెగా మాస్ కమ్ బ్యాక్’ తో మళ్ళీ పాత ఫామ్‌లోకి వచ్చిన చిరంజీవి, ఇప్పుడు తన పూర్తి ఫోకస్ ‘విశ్వంభర’పై పెట్టారు. ఈ హిట్ ఇచ్చిన ఊపుతో విజువల్ వండర్ గా రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు పెంచే స్పేస్ దొరికింది. ఒక డిజాస్టర్ తర్వాత మళ్ళీ అదే రేంజ్‌లో ప్రాఫిట్స్ అందించడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యం. 2026 వేసవి చివరలో రాబోతున్న ‘విశ్వంభర’తో చిరంజీవి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.