దర్శకుడికి మహేష్ బాబు హెచ్చరిక

తెలుగు సినిమాపై బలమైన ముద్ర వేసిన రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో గుణశేఖర్ కూడా ఒకడు. తొలి చిత్రం ‘సొగసు చూడతరమా’తోనే అవార్డులు కొల్లగొట్టిన అతను.. ఆ తర్వాత ‘బాల రామాయణం’తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆపై చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్లు తీశాడు.

ఐతే ‘ఒక్కడు’ తర్వాత ఆయన కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా ‘ఒక్కడు’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ మహేష్ బాబుతో చేసిన ‘అర్జున్’, ‘సైనికుడు’ చిత్రాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘సైనికుడు’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది. 

‘సైనికుడు’ సహా కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన పెద్ద తప్పు సెట్స్ మీద ఎక్కువ ఆధారపడడమే అంటున్నాడు గుణశేఖర్. తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ.. సెట్స్ పట్ల తన మోజు విషయమై మహేష్ బాబు కూడా తనను హెచ్చరించినట్లు వెల్లడించాడు.

‘‘భారీ సెట్స్ వేసి సినిమాలు తీయడం నన్ను దెబ్బ తీసింది. చూడాలని ఉంది, ఒక్కడు లాంటి చిత్రాలకు కథ ప్రకారమే వెళ్లా. కానీ తర్వాత సెట్స్ విషయంలో ట్రాప్‌లో పడిపోయాను. ‘సైనికుడు’ సినిమా కోసం వేయి స్తంభాల సెట్స్ వేశాం. కానీ అప్పటికే నేను ఆ ట్రాప్‌లో పడ్డాను. ఆ సినిమా షూటింగ్ టైంలో మహేష్ నన్ను హెచ్చరించాడు.

‘సెట్స్ భారీగా వేయడం వల్ల అక్కడే ఎక్కువ వర్క్ చేయాలనే ఉద్దేశం పెరుగుతుంది. దీంతో కథ అటు వైపు తిరుగుతోందని అనిపిస్తోంది’ అని మహేష్ అన్నాడు. ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపించింది. సెట్ వేశాం కదా అని అక్కడ సీన్లు పెచండం.. డేలో ఒక పాట, నైట్ ఎఫెక్ట్‌లో ఇంకో పాట తీయడం.. ఇలా జరిగింది. దీంతో కథ లిమిట్ అయిపోతోందని నేనూ రియలైజ్ అయ్యాను. దీంతో ఇక సెట్స్ జోలికి వెళ్లకూడదు అనుకున్నా. మహేష్ మాటలతో దాన్నుంచి బయటికి వచ్చాను’’ అని గుణశేఖర్ తెలిపాడు.