టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా లేదు. ఒకరేమో చిరంజీవి తండ్రి పాత్ర చేస్తున్నారు, కనిపించే పదిహేను నిమిషాలు స్క్రీన్ దద్దరిల్లి పోతుందని అంటారు. ఇంకొకరేమో వర్షం తర్వాత గోపీచంద్ ఇందులో విలన్ గా చేయబోతున్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఫేస్ ఆఫ్ చూసేందుకు రెండు కళ్ళు చాలవని చెబుతారు. మరొకరు ఇంకో అడుగు ముందుకేసి ప్రభాస్ ని రెండు గంటలు ఎండలో నిలబెట్టి మరీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షాట్ ఓకే చేశాడని టంకు కొడతారు. ట్విస్టు ఏంటంటే ఇవేవి నిజాలు కాదు. అన్నీ గాసిప్సే.
సోషల్ మీడియాలో రీచ్ కోసం కొన్ని హ్యాండిల్స్ పడుతున్న తంటాలకు ఇది నిదర్శనం. స్పిరిట్ గురించి ఏ వార్త అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది. అందులోనూ రాజా సాబ్ వల్ల తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు వంగా మీద మాములు ఆశలు లేవు. ఓ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే అతను కష్టపడతాడని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఏ అప్డేట్ అయినా నిజమా కాదా అని తెలుసుకునే లోపు ఊరంతా చక్కర్లు కొట్టేస్తోంది. కొంత కీలక భాగం పూర్తి చేసిన ప్రభాస్ వచ్చే నెల మొదటి వారంలో ఫౌజీకి కొన్ని డేట్లు ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందులో కీలక షెడ్యూల్ ఉంటుందట.
వీటి సంగతి ఎలా ఉన్నా వచ్చే ఏడాది మార్చి 5 విడుదల తేదీ లాక్ చేసుకోవడంతో స్పిరిట్ ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి రిలీజ్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. తన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ తో పెద్దగా పనుండదు. సన్నివేశాల్లోని డెప్త్ తోనే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తారు. యానిమల్ లో జరిగింది అదే. ఇప్పుడీ స్పిరిట్ లో కూడా అంతకు మించే ఉంటాయట. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో ప్రభాస్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో వస్తున్నాయని అంటున్నారు. అయినా ఇంకా పద్నాలుగు నెలల టైం ఉంది కాబట్టి ఇంకా బోలెడు ఇన్ఫో రావాల్సి ఉంటుంది కనక ఫ్యాన్స్ ప్రశాంతంగా ఉండొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates