సంక్రాంతి హ్యాంగోవర్ నుంచి బయటికొస్తారా?

కొత్త ఏడాది ఆరంభమవుతుంటే.. తెలుగు ప్రేక్షకుల దృష్టంతా సంక్రాంతి మీదే ఉంటుంది. ఆ పండక్కి భారీ చిత్రాలు, ఎక్కువ సంఖ్యలో రిలీజవుతుంటాయి. ఈసారి రెండు పెద్ద సినిమాలు, మూడు మిడ్ రేంజ్ సినిమాలు.. మొత్తంగా అయిదు సినిమాలు థియేటర్లలోకి దిగాయి.

వాటిలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయాన్నందుకుంది. నవీన్ పొలిశెట్టి మూవీ ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ సూపర్ హిట్లయ్యాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ యావరేజ్‌గా ఆడింది. ‘రాజాసాబ్’ ఫ్లాప్ అయింది.

ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ.. పండక్కి ప్రతి సినిమా వాటి వాటి స్థాయికి మించే వసూళ్లు రాబట్టిందన్నది వాస్తవం. చిరు, నవీన్, శర్వా సినిమాలు ఇంకా కూడా ఆడుతున్నాయి. ఐతే సంక్రాంతి సినిమాల హ్యాంగోవర్ తర్వాత ప్రేక్షకులు దాన్నుంచి బయటి రావడమే కొంచెం కష్టం. అందుకే తర్వాతి వారాల్లో చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఉండవు. ఉన్నా కూడా ఆశించిన వసూళ్లు రావు.

సంక్రాంతికి సినీ వినోదం ఓవర్ డోస్ అయిపోతుంది. దీనికి తోడు బాగా డబ్బులు ఖర్చయిపోవడం వల్ల తర్వాతి వారాల్లో వచ్చే కొత్త సినిమాలను పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. అందుకే తర్వాతి వారం అసలు కొత్త సినిమా ఏదీ రిలీజే కాలేదు. ఈ నెల 23కు అనుకున్న ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రాన్ని ఇంకో వారం వెనక్కి జరిపారు.

కానీ ఈ వారం అయినా ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అన్నది సందేహం. ఇది రీమేక్ కావడం కూడా ఒక మైనస్. కానీ ట్రైలర్ మాత్రం బాగుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జోడీ ఆసక్తి రేకెత్తిస్తోంది. గోదావరి టచ్‌తో వినోదాన్ని బాగానే పండించినట్లున్నారు. మరి ఆడియన్స్ సంక్రాంతి సినిమాల మత్తు నుంచి బయటికి వచ్చి ఈ చిత్రాన్ని ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.