జన నాయకుడికి మోక్షం దొరికేదెప్పుడు

విజయ్ జన నాయకుడు కథ మళ్ళీ మొదటికే వచ్చింది. యు/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కౌంటర్ అఫిడవిట్ కు తగినంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ తిరిగి కొత్తగా పరిశీలించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో సెన్సార్ బోర్డుకి తన అభ్యంతరాలను బలపరుచుకునేందుకు మరింత సమయం దొరికింది. ఒకవేళ నిర్మాణ సంస్థ కెవిఎన్ కనక రిట్ పిటీషన్ లో సవరణ వద్దనుకుంటే సిబిఎఫ్సి చెప్పిన కట్స్, మ్యూట్స్ అన్నీ అంగీకరించి విడుదలకు రూటు క్లియర్ చేసుకోవాలి. కానీ అవి ఎక్కువ మోతాదులో ఉండటంతో సాధ్యం కాకపోవచ్చు.

ఈ లెక్కన చూస్తే జన నాయకుడు ఫిబ్రవరి లేదా మార్చిలో రావడం అనుమానంగానే ఉంది. ప్రొడ్యూసర్ కనక పోరాటం చేయాలని నిర్ణయించుకుంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే  డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి అధికంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ సైతం ఏదో ఒకటి తేల్చమని పోరు పెడుతోందట.

దీని వల్ల కెవిఎన్ బ్యానర్ లో రూపొందుతున్న టాక్సిక్ తో పాటు త్వరలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి – బాబీల మూవీ కూడా ఆలస్యమవుతోందని చెన్నై టాక్. జన నాయకుడు కనీసం వచ్చే నెలైనా వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న బయ్యర్లకు ఈ పరిణామాలు శరాఘాతంగా మారాయి.

విజయ్ మాత్రం ఈ విషయాల పట్ల ఎక్కువ స్పందించడం లేదు. సినిమా గురించి మాట్లాడితే రాజకీయాలను సినిమాల కోసం వాడుతున్నాడని ప్రత్యర్థులు దాన్ని ఆయుధంగా వాడుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నాడు.

మలేషియాలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఒక్కసారిగా హైప్ అమాంతం పెరిగింది. కానీ కోర్టు కేసుల వల్ల చల్లారిపోయే దిశగా ఉంది. అయినా సరే విడుదల ఫిక్స్ అయితే అభిమానులు యాక్టివ్ అయిపోయి వేరే లెవెల్ హైప్ తీసుకొస్తారు కానీ, ఎటొచ్చి ఎప్పుడనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వీలైనంత త్వరగా సాల్వ్ కాకపోతే మళ్ళీ వేసవికి వెళ్ళాల్సిందే.