బ్రిటిష్ రక్తపుటేరుల్లో ‘రణబాలి’ తిరుగుబాటు

వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా రూటు మార్చి పీరియాడిక్ సెటప్స్ వైపు వెళ్ళిపోతున్నాడు. వాటిలో ముందుగా వస్తున్నది రణబాలి. తనతో టాక్సీవాలా, నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈసారి పెద్ద బాధ్యతను తీసుకున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 11 విడుదల కానుంది. అంటే రౌడీ జనార్ధనకు నాలుగు నెలల ముందన్న మాట. ఇవాళ కాన్సెప్ట్ పరిచయం చేసే టీజర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసి అభిమానులకు కానుకగా ఇచ్చారు.

1878. స్వాతంత్రం రాకముందు దేశంలో బ్రిటిషర్ల అరాచకం పెట్రేగిపోయింది. లక్షల కోట్ల విలువైన సంపద హద్దులు దాటేసింది. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక మేజర్ చేసిన అకృత్యాల వల్ల ఒక ప్రాంతం మొత్తం వల్లకాడయ్యే పరిస్థితి తలెత్తింది.

సహాయం కోసం నోరు కూడా తెరవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందరో భారతీయులకు అండగా నిలబడేందుకు ఒక యువకుడు తెగించాడు. అతనే రణబాలి. బ్రిటిష్ సైనికుడిని గుర్రం వెనుక కట్టుకుని రైల్వేట్రాక్ మీద పరుగులు పెట్టే సాహసం ఇతని సొంతం. మరి ఈ మరణహోమాన్ని అతను ఎలా ఆపాడనేది తెరమీద చూసి తెలుసుకోవాలి.

విజువల్స్ ని ఎక్కువ రివీల్ చేయకపోయినా యానిమేషన్ రూపంలో కాన్సెప్ట్ ని చక్కగా వివరించారు. అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ ఇవ్వగా చివరి షాట్లో విజయ్ దేవరకొండ ఇంట్రో అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా సాగింది.

బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ కనక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన ఆర్టిస్టులను చూపించలేదు. రిలీజ్ డేట్ నాన్చకుండా ముందే చెప్పేయడంతో ఎప్పుడు వస్తుందనే సస్పెన్స్ ఉండదు. అంచనాలు రేపడంలో టీమ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. విజయ్ దేవరకొండకు లైఫ్ టైం రోల్ లా అనిపిస్తోంది.