ఈ రోజుల్లో ఒక కథానాయకుడు, ఒక దర్శకుడు కలిసి మూణ్నాలుగు సినిమాలు చేస్తేనే.. దాన్నో విశేషంగా చెప్పుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇలా ఒక హీరో, డైరెక్టర్ కలిపి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కోదండరామిరెడ్డి కలయికలో 20కి పైగా సినిమాలు రావడం విశేషం.
మలయాళంలో ఇంతకుమించిన గ్రేట్ కాంబినేషన్ ఒకటి ఉంది. అక్కడ నంబర్ వన్ హీరో అయిన మోహన్ లాల్.. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశాడు. వీరి మధ్య బంధం సినిమాను దాటి వ్యక్తిగత స్థాయికి కూడా వెళ్లింది. వీరి కుటుంబాల మధ్య కూడా గొప్ప స్నేహం ఉంది.
80వ దశకం నుంచి సినిమాలు తీస్తున్న ప్రియదర్శన్.. ఇప్పటికీ మెగా ఫోన్ పక్కన పెట్టలేదు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఆయన ఇప్పుడు దర్శకుడిగా తన వందో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ చిత్రంలో మోహన్ లాలే కథానాయకుడిగా నటించబోతుండడం విశేషం.
దర్శకుడిగా ప్రియదర్శన్ ప్రయాణం మొదలైందే మోహన్ లాల్‌తో. 1982లో ఆయన తీసిన సింధూర సంధ్యక్కు మౌనంలో మోహన్ లాల్ ముఖ్య పాత్ర పోషించాడు. మళ్లీ ఇప్పుడు ప్రియదర్శన్ వందో సినిమాలోనూ మోహన్ లాల్ నటించబోతుండడం ఎంతో ప్రత్యేకం. ఇలాంటి రికార్డు ఇంకెవరికీ ఉండదని అంటున్నాడు ప్రియదర్శన్.
వీరి కలయికలో చివరగా 2016లో ఒప్పం సినిమా వచ్చింది. అది మలయాళంలో సూపర్ హిట్ అయింది. అందులో మోహన్ లాల్ అంధుడి పాత్ర పోషించాడు. ఉత్కంఠ రేకెత్తిస్తూనే హృద్యంగా సాగే సినిమా అది. తెలుగులో కనుపాప పేరుతో విడుదలైందా చిత్రం.
ప్రియదర్శన్ మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలు తీస్తూ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. మలయాళంలో టాప్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఆయన తెలుగులో అక్కినేని నాగార్జునతో నిర్ణయం సినిమా తీశారు. అది ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన లిజిని ప్రియదర్శన్ పెళ్లి చేసుకున్నారు. వీరి తనయురాలే కళ్యాణి ప్రియదర్శన్. ఐతే ప్రియదర్శన్, లిజి 2016లో విడాకులు తీసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates