స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. కొన్నేళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో, తమిళంలో టాప్ స్టార్ల సినిమాలను రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ మధ్య ఎంతో శ్రద్ధ తీసుకుని ‘పడయప్పా’ (తెలుగులో నరసింహా) చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అది సంచలన వసూళ్లు సాధించింది.
ఇప్పుడు రజినీ మరో పాత సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలా అని అది రీ రిలీజ్ అనుకుంటే పొరపాటే. 37 ఏళ్ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమాను కాస్తా.. ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా పేరు.. హమ్ మే షెహెన్ షా కౌన్. ఈ హిందీ చిత్రాన్ని షూటింగ్ మొదలుపెట్టిన 37 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయబోతుండడం విశేషం.
రజినీతో పాటు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా ముఖ్య పాత్రలు పోషించిన ‘హమ్ మే షెహెన్ షా కౌన్’ను 1988లో రిలీజ్ చేయాలనుకున్నారు. హర్మేష్ మల్హోత్రా రూపొందించిన ఈ చిత్రం రకరకాల కారణాలతో అప్పుడు విడుదలకు నోచుకోలేదు. ల్యాబ్‌లోనే ఉండిపోయిన ఈ సినిమా ప్రింట్లను ఇప్పుడు రీ మాస్టర్ చేస్తున్నారు.
ఈ సినిమా మీద తాము ఎప్పుడూ ఆశ కోల్పోలేదని.. ‘హమ్ మే షెహెన్ షా కౌన్’ ఎన్నో ఎదురు దెబ్బలను, నిశ్శబ్దంతో కూడిని బాధను భరించిందని.. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులను ఈ సినిమా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజా రాయ్ తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మరి ఇన్నేళ్ల తర్వాత విడుదలకు నోచుకుంటున్న తన చిత్రాన్ని రజినీకాంత్ ప్రమోట్ చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రంలో దివంగత అమ్రిష్ పురి కూడా ఒక కీలక పాత్ర చేయడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates