ప్ర‌భాస్ ఫ్యాన్స్ బూతులు… ప్రొడ్యూసర్ ఫిర్యాదు

రాజాసాబ్ సినిమా మీద ప్ర‌భాస్ అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు, అంచ‌నాలు నిల‌బ‌డ‌లేదు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకుంది. సినిమాకు ముందు రోజు ప్రిమియ‌ర్స్ ప‌డ్డ‌పుడు, తొలి రోజు ప్ర‌భాస్ ఫ్యాన్స్.. ద‌ర్శ‌కుడు మారుతి మీద త‌మ అస‌హ‌నాన్ని చూపించారు. కానీ త‌ర్వాత కొంచెం కామ్ అయ్యారు.

సంక్రాంతి టైంలో సినిమాను ఆడ‌నిద్దాం అనో ఏమో.. సైలెంటుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ద‌ర్శ‌కుడు మారుతిని గ‌త రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దారుణంగా తిట్ట‌డం మొద‌లుపెట్టారు.

మారుతిని మాత్ర‌మే కాదు.. అత‌డి మిత్రుడు, రాజాసాబ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎస్కేఎన్‌ను సైతం ప్ర‌భాస్ అభిమానులు వ‌దిలిపెట్ట‌ట్లేదు. బూతుల‌తో రెచ్చిపోతున్నారు.

ఇప్పుడు ఉన్న‌ట్లుండి త‌న‌ను, మారుతిని వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో ప‌నిగ‌ట్టుకుని టార్గెట్ చేస్తుండ‌డంతో ఎస్కేఎన్ తీవ్ర ఆవేద‌న‌కు గురైన‌ట్లే క‌నిపిస్తున్నాడు. త‌న మీద సోష‌ల్ మీడియాలో ఎటాక్ చేస్తున్న వారి మీద‌ ఎస్కేఎన్ హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌మ సినిమాను అందులోని కాస్ట్ అండ్ క్రూను ల‌క్ష్యంగా చేసుకుని దురుద్దేశ‌పూర్వ‌కంగా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఎస్కేఎన్.

ఇది సాధార‌ణ సోష‌ల్ మీడియా ట్రోలింగ్‌లా లేద‌ని.. ఒక వ‌ర్గం ప‌నిగ‌ట్టుకుని త‌మను టార్గెట్ చేస్తోంద‌ని ఎస్కేఎన్, మారుతి అనుమానిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ప‌నిగ‌ట్టుకుని ఇలా బూతులు తిడుతూ త‌మ‌ను టార్గెట్ చేయ‌డం వెనుక ఏదో కుట్ర ఉంద‌ని వారు సందేహిస్తున్నారు.

మ‌రి ఎస్కేఎన్ ఫిర్యాదుపై పోలీసులు ఏం చ‌ర్య‌లు చేప‌డ‌తారో.. మారుతిని, ఎస్కేఎన్‌ను బూతులు తిడుతున్న వాళ్లు ఏమేర త‌గ్గుతారో చూడాలి. 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో తెర‌కెక్కిన రాజాసాబ్‌ను టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. ఈ హార్ర‌ర్ ఫాంట‌సీ చిత్రం ప్రారంభ‌మైన‌ మూడేళ్ల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.