బాలయ్య కోసం కొత్త కథ రెడీ

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ స్పీడే వేరు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలి, ఏడాదికి ఒక్క చిత్రమైనా రిలీజయ్యేలా చూసుకోవాలి అనే సూత్రాన్ని ఆయన వంద శాతం పాటిస్తుంటారు. ఒక సినిమా రిలీజయ్యేలోపు ఇంకో చిత్రాన్ని మొదలుపెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటాడు. గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తుంటాడు.

కొన్నేళ్లుగా వరుస విజయాలతో సాగిపోతున్న బాలయ్య.. ‘అఖండ-2’ రిలీజైన వెంటనే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడానికి ఎప్పుడో అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. కానీ ‘అఖండ-2’ అంచనాలకు తగ్గట్లు ఆడకపోవడం, కొత్త సినిమా బడ్జెట్ అదీ మరీ పెద్దదైపోవడంతో టీం పునరాలోచనలో పడింది. ముందు అనుకున్న చారిత్రక కథను పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత తన టీంతో కలిసి ఇంకో కథ మీద కసరత్తులు మొదలుపెట్టాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

అందువల్లే డిసెంబరులోనే మొదలు కావాల్సిన సినిమా కాస్తా సంక్రాంతి తర్వాత కూడా సెట్స్ మీదికి వెళ్లలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి ఆరంభంలో మొదలు కాబోతోందట. రెండు మూడు కొత్త లైన్లు అనుకుని వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసిన గోపీచంద్ అండ్ టీం.. ఒక కథను లాక్ చేసి దానికి ఫుల్ స్క్రిప్టు రెడీ చేసిందన్నది లేటెస్ట్ న్యూస్.

వీరసింహారెడ్డి తరహాలోనే ఇది మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. సాయిమాధవ్ బుర్రా సహకారంతో గోపీచంద్ ఈ స్క్రిప్టు రెడీ చేశారట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకువెళ్లబోతున్నారు. ఇంతకుముందే ఈ సినిమాకు ముహూర్తం జరిగింది. కానీ కథ మారిన నేపథ్యంలో మరోసారి సింపుల్‌గా ముహూర్త వేడుక జరిపి ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాది దసరా రిలీజ్ లక్ష్యంగా ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించనున్నారట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.