సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ అఫీషియల్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. చిన్న టీజరే అయినప్పటికీ మూవీ లవర్స్ లో దాని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇది నాని, నితిన్ లాంటి సీనియర్ల దగ్గరకు వెళ్లి, వాళ్లకు నచ్చి ఏవేవో కారణాల వల్ల దేవి చేతికి వచ్చింది.
బలగం తర్వాత దీని కోసమే మూడేళ్ళ సమయాన్ని కేటాయించిన వేణు స్క్రిప్ట్, బడ్జెట్ విషయంలో పక్కా ప్రణాళికతో ప్లానింగ్ చేసుకున్నాడని సమాచారం. అయితే ఎల్లమ్మ క్యారెక్టరైజేషన్ చాలా షాకింగ్ గా ఉండబోతోందని అంతర్గత సమాచారం.
లీకైన సోర్స్ ప్రకారం చూస్తే ఆసక్తికరమైన అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఏపీ తెలంగాణలో రేణుకా ఎల్లమ్మ గ్రామదేవతని కొలిచే భక్తులు కోట్లలో ఉన్నారు. ముఖ్యంగా నైజామ్ ప్రాంతంలో ఎంత చెప్పినా తక్కువే అనే స్థాయిలో పూజలు చేస్తుంటారు.
రేణుక అంటే పురాణాల్లో మహర్షి జమదగ్ని భార్య. పర పురుషుడిని అనుకోకుండా చూసిన కారణంగా భర్త శాపానికి గురై తొలుత కురూపిగా మారి, ఆ తర్వాత తండ్రి ఆజ్ఞ మేరకు స్వంత కొడుకు పరశురాముడి చేతిలో హతమై, దైవకృప వల్ల తిరిగి ప్రాణం దక్కించుకుంటుంది. అయితే ఎల్లమ్మ దేహానికి తల అతికించే పరిస్థితి రావడంతో అక్కడి నుంచి రేణుక ఎల్లమ్మగా ప్రాచుర్యం పొందుతుంది.
పరశురాముడు కాకుండా మిగిలిన నలుగురు కొడుకులు శాపగ్రస్తులైతే వాళ్ళను అక్కున చేర్చుకుని మాతృత్వ గొప్పదనాన్ని చాటుతుంది. ఇలా రేణుక ఎల్లమ్మ గురించి ఎంతో పురాణం, బోలెడు సినిమాలు వచ్చాయి.
ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్న సినిమా ఆ కాలంలో చూపించకపోయినా పాత్ర తాలూకు నేపథ్యం, క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం రేణుక ఎల్లమ్మ నుంచే వేణు స్ఫూర్తిగా తీసుకుని, దానికి జానపద కళాకారుల జీవితాలను జోడించాడని ఇన్ సైడ్ టాక్. ఇందులో నిజమెంతుందో చెప్పలేం కానీ మొత్తానికి 2026 మోస్ట్ షాకింగ్ కంటెంట్స్ లో ఎల్లమ్మ ఉండబోతోందనేది మాత్రం వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates