వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి చేయబోతున్న మెగా 158 కోసం దర్శకుడు బాబీ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఈ నెల 25 పూజా కార్యక్రమాలు ఉంటాయనే సమాచారం వచ్చింది కానీ అదే రోజు మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ మీట్ ప్లానింగ్ జరగబోతున్న నేపథ్యంలో రెండూ ఉంటాయా లేక ఏదైనా డ్రాప్ అవుతుందానేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఈ యాక్షన్ మూవీలో చిరంజీవికి వయసొచ్చిన కూతురు పాత్ర ఒకటుంటుంది. దర్బార్ లో రజనీకాంత్ కు నివేదా థామస్ లాగా ఇందులో కూడా చాలా ప్రాధాన్యం కలిగిస్తారట. రెండు పేర్లు తీవ్ర పరిశీలనలో ఉన్నాయని యూనిట్ లీక్.
మొదటి అమ్మాయి అనస్వర రాజన్. ఇటీవలే రోషన్ మేక ఛాంపియన్ తో పలకరించిన ఈ మలయాళ భామ డెబ్యూ పరంగా కమర్షియల్ ఫలితం అందుకోలేదు కానీ నటన, అందం, లుక్స్ ఇలా అన్ని విషయాల్లో మంచి మార్కులు కొట్టేసి దర్శకుల దృష్టిలో పడింది. ఆమె గురించి రామ్ చరణ్ ఎంత గొప్పగా ఫీలయ్యాడో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూశాం. సో ఆనస్వర బెటర్ ఛాయస్ అవుతోంది.
రెండో ఆల్టర్నేటివ్ కృతి శెట్టి. ఉప్పెనలో వైష్ణవ్ తేజ్ తో పాటు పరిచయమైన బేబమ్మకు ఆ తర్వాత ఒకటి రెండు హిట్లు పడ్డాయి కానీ అటుపై సక్సెస్ లేక బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. వా వతియార్ కూడా ఫ్లాపే.
ఫైనల్ గా ఎవరిని లాక్ చేస్తారనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక క్యామియో చేస్తారనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. అధికారికంగా ఏదీ ప్రకటించడం లేదు. ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారనే ప్రచారాన్ని యూనిట్ ఖండిస్తున్న దాఖలాలు లేవు కాబట్టి దాదాపు నిజమే అయ్యేలా ఉంది.
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న మూవీ కావడంతో దీని మీద పెద్ద ఎత్తున అంచనాలు నెలకొంటున్నాయి. వేసవిలో విశ్వంభర వచ్చేస్తుంది కనక 2027 సంక్రాంతికి మెగా 158ని థియేటర్లలో చూడొచ్చు. టీమ్ ప్లాన్ అయితే ప్రస్తుతానికి ఇదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates