పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ వంటకం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాక అత్యధిక హైప్ తెచ్చుకున్న మూవీ.. ఓజీ. దాని తాలూకు ప్రతికూల ప్రభావం పవన్ వేరే సినిమాల మీద పడింది. ఈ విషయంలో ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నం కూడా కొంత ఫీలయ్యారు ఆ మూవీ రిలీజ్ టైంలో. ఓజీ రిలీజయ్యే వరకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు పవన్ ఫ్యాన్స్. మరోవైపు ఇది రీమేక్ మూవీ అన్న ప్రచారం ఉండడం, హరీష్ శంకర్ చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో అంచనాలు ఇంకా తగ్గిపోయాయి. 

కానీ ఈ చిత్రం రీమేక్ కాదని హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడం.. అలాగే ఈ సినిమా నుంచి లాంచ్ చేసిన తొలి పాట ‘దేఖ్‌లేంగే సాలే’ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఆటోమేటిగ్గా హైప్ వచ్చేసింది. పవన్ ఎలాంటి సినిమా చేసినా.. రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుందన్నది దశాబ్దాలుగా చూస్తున్న సంగతే.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ అదే జరుగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా హైప్‌ను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లే పాట ఒకటి సినిమాలో ఉండబోతోందన్న సంకేతాలను దర్శకుడు హరీష్ శంకర్ ఇస్తున్నాడు. పవన్‌ అభిమానులను ఉర్రూతలూగించేలా ఒక బ్యాగ్రౌండ్ సాంగ్ రెడీ చేయిస్తున్నాడు హరీష్.

దీని కోసం పవన్ మీద ప్రత్యేకంగా చిత్రీకరణ చేయాల్సిన అవసరమేమీ లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవర్ స్టార్ సెలవు తీసుకున్నాడు కూడా. ఐతే పవన్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చేలా.. ఒక ట్రిబ్యూట్ లాగా ఈ పాటను తీర్చిదిద్దుతున్నారట. 

రెండు రోజుల పాటు లిరిసిస్ట్‌ చంద్రబోస్‌తో కూర్చుని ఈ పాట రాయించుకున్నాడు హరీష్. చంద్రబోస్ ఎంత తపనతో ఈ పాట రాశాడో, ఈ పాట ఏ లెవెల్లో ఉండబోతోందో చెబుతూ ఎక్స్‌లో పోస్టులు కూడా పెట్టాడు హరీష్ శంకర్.

మామూలుగా అయితే ఇలాంటి పాట రాయాలంటే వారమైనా పడుతుందని.. కానీ బోస్ ఎంతో శ్రమించి, తపించి రెండు రోజుల్లోనే ఈ సాంగ్ పూర్తి చేశాడని హరీష్ చెప్పాడు. తన మాటల్ని బట్టి చూస్తే సినిమాలో ఈ పాట చాలా స్పెషల్‌గా ఉండబోతోందని, అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అర్థమవుతోంది.