విచిత్రంగా ఉండబోతున్న అనిల్ పదో సినిమా

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి మేఘాల్లో తేలిపోతున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ కో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఈసారి చిరంజీవికి కూడా ఇండస్ట్రీ హిట్ బహుకరించడంతో ఇతర భాషల్లోనూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.

2026 మొదటి సూపర్ సక్సెస్ మూవీగా బాలీవుడ్ వర్గాలు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాయంటే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇలా ఏవేవో పేర్లు ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానికి కొంత క్లారిటీ ఇస్తున్నారు అనిల్.

వైజాగ్ టూర్ లో ఉన్నప్పుడు ఒక లైన్ తట్టిందని, ప్రకటన స్టేజి నుంచే విచిత్రమైన జర్నీ అనిపించేలా అనౌన్స్ మెంట్ ఉంటుందని, విన్నాక వీడు మళ్ళీ వస్తున్నాడురా అని అనుకునేవాళ్లు ఉంటారని ఊరించాడు.

అయితే హీరో ఎవరో ఫిక్స్ కాలేదని, స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక హీరోని సెట్ చేసుకుంటానని, డేట్ల అందుబాటు వగైరాలు చూసుకోవాలి కాబట్టి అవన్నీ అయ్యాక జూన్ లేదా జూలైలో మొదలు పెడతామని అన్నారు. అంటే 2027కి పండగ బొనాంజా సిద్ధం అవుతుందన్న మాట. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ లేదనే స్పష్టత ఈ సందర్భంగా వచ్చేసింది కాబట్టి కొత్త సబ్జెక్టు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

ఇదే కాదు అనిల్ రావిపూడి పదకొండో సినిమాకు కూడా ప్రిపరేషన్ ఉంటుందట. భగవంత్ కేసరిలా డిఫరెంట్ ప్రయత్నం చేస్తానని, అందులో సర్ప్రైజ్ ని ఇప్పుడప్పుడే రివీల్ చేయనని ఇంకో ట్విస్టు ఇచ్చాడు.

ప్రాపర్ కమర్షియల్ కంటెంట్ అంటే ఏంటో రీజనబుల్ బడ్జెట్ లోనే చేసి చూపిస్తున్న అనిల్ రావిపూడి అంత పెద్ద మన శంకరవరప్రసాద్ గారునే పాతిక రోజుల్లో రాసినప్పుడు ఇప్పుడు ఫిక్స్ చేసుకున్న లైన్ డెవలప్ చేయడానికి ఎక్కువ సమయం అవసరముండదు. పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం వస్తే అంతకంటే ఏం కావాలని చెబుతున్న రావిపూడికి తనకన్నా ఎక్కువ పవన్ ఫాన్సే తమ కాంబోని కోరుకుంటున్నారని తెలిసే ఉంటుంది.