రేపు బాలీవుడ్ మల్టీస్టారర్ బోర్డర్ 2 విడుదల కానుంది. 1997లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొనసాగింపుగా రూపొందిన ఈ వార్ డ్రామా ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకన్నా ఎక్కువ లెన్త్ తో దురంధర్ ఆల్ టైం రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
యానిమల్, పుష్ప 2 ఇదే దారిలో గొప్ప విజయాలు అందుకున్నాయి. అలాంటప్పుడు బోర్డర్ 2కి వచ్చిన సమస్యేంటని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చు. కానీ ఇలాంటి యుద్ధ నేపథ్యంలో సాగే సినిమాలలో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఎలివేషన్ కు చోటు కల్పించినప్పటికీ భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అలాంటప్పుడు మూడున్నర గంటల పాటు ఇలాంటి కంటెంట్ అంగీకరించడం అంత సులభంగా ఉండదు. గతంలో బోర్డర్ 2 నిర్మాత జెపి దత్తా ఎల్ఓసి లైన్ అఫ్ కంట్రోల్ ని నాలుగు గంటల నిడివితో రిలీజ్ చేశారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎందరో స్టార్లు దాంట్లో భాగమయ్యారు. కానీ రెండు వందల నలభై నిమిషాల యుద్ధాన్ని ఆడియన్స్ భరించలేక ఫ్లాప్ చేశారు.
అత్యంత పొడవైన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోవడం తప్ప ఎల్ఓసి సాధించింది ఏమి లేదు. బోర్డర్ 2 ని డైరెక్ట్ చేసింది దత్తా కాకపోయినా కథ, పర్యవేక్షణ మొత్తం ఆయనదే. పైగా నిర్మాణ భాగస్వామి కూడా. దర్శకత్వం అనురాగ్ సింగ్ కు అప్పగించారు.
రాజా సాబ్ ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చకపోవడంతో అక్కడి ట్రేడ్ ఆశలన్నీ బోర్డర్ 2 మీదే ఉన్నాయి. ఇది కూడా మొదటి భాగంలాగే 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందింది. కాకపోతే వేరే ఘట్టాలను తీసుకుని విఎఫ్ఎక్స్, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు చాలా వాడారు.
ముఖ్యంగా సన్నీ డియోల్ అభిమానులు చాలా అంచనాలు పెట్టేసుకున్నారు. లెన్త్ ఏ మాత్రం తేడా కొట్టినా, ఎక్కువనిపించినా టాక్ పరంగా తేడా వచ్చేస్తుంది. వరుణ్ ధావన్, దిల్జిత్, అహాన్ శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన బోర్డర్ 2 సెంటర్ అఫ్ అట్రాక్షన్ మాత్రం సన్నీ డియోలే. చూడాలి మరి ఏ మేరకు మెప్పిస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates