గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్ లో మోస్తరుగా హైలెట్ అయినా సౌత్ సైడ్ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ట్రైలర్ లో కంటెంట్ డెప్త్ గట్టిగానే ఉన్నా రీచ్ అంతగా రాలేదు. కానీ రాజమౌళి పోస్ట్ చేశాక లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో ప్రియాంక చూపించిన వైల్డ్ అండ్ బ్రూటల్ యాక్టింగ్ చూసి దర్శకధీరుడు రాజమౌళి ఫిదా అయ్యారు.
ప్రియాంకను “అన్‌స్టాపబుల్” అని అభివర్ణిస్తూ, ఆమె పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫైరీ పెర్ఫార్మెన్స్‌పై జక్కన్న ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళి స్వయంగా ట్వీట్ చేయడంతో సౌత్ ఇండియాలో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’లో ప్రియాంక ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఒకవైపు రాజమౌళి సినిమాలో మందాకినిగా కనిపిస్తూనే, మరోవైపు ‘ది బ్లఫ్’ లో ‘బ్లడీ మేరీ’ అనే మాజీ పైరేట్ క్వీన్‌గా రక్తపాతం సృష్టించడానికి ఆమె సిద్ధమైంది.
ఈ చిత్రంలో ఆమె నటనలోని ఫైర్ ని చూసి రాజమౌళి ఆశ్చర్యపోయారు. జక్కన్న లాంటి డైరెక్టర్ ఒక సినిమా గురించి పాజిటివ్‌గా స్పందించారంటే, అందులో కంటెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
‘ది బ్లఫ్’ కథ 1800ల కాలంలో కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగుతుంది. తన గతంలోని హింసను వదిలేసి ప్రశాంతంగా జీవించాలనుకునే ఒక మాజీ దొంగల రాణి, మళ్ళీ ఆయుధం పట్టాల్సి వస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా పాయింట్.
ట్రైలర్‌లో ప్రియాంక ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయి ఉన్న విజువల్స్ చూస్తుంటే, ఆమె ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడిందో తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ కార్ల్ అర్బన్ ఇందులో విలన్‌గా కనిపిస్తుండగా, రూసో బ్రదర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు.
రాజమౌళి ట్వీట్‌కు ప్రియాంక కూడా అంతే ఆత్మీయంగా స్పందించారు. “మీ దయతో కూడిన మాటలకు ధన్యవాదాలు సర్” అంటూ ఆమె థాంక్స్ చెప్పారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇప్పుడు ‘వారణాసి’ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ‘వారణాసి’లో మందాకినిగా ప్రియాంకను రాజమౌళి ఏ రేంజ్‌లో చూపిస్తారో అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఇక ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates