కష్టాల కడలిలో నాయకుడి ఎదురీత

రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా తెమిలేలా లేదు. మదరాస్ హైకోర్టు నుంచి ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం దాకా నిర్మాత, సెన్సార్ అధికారుల మధ్య జరుగుతున్న లా వార్ ఎప్ప్పుడు తేలుతుందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

రేపు కనక తుది తీర్పు రాకపోతే మళ్ళీ రిపబ్లిక్ డే తర్వాతే హియరింగ్ వస్తుంది. అప్పుడైనా ఫైనల్ జడ్జ్ మెంట్ ఇస్తారో లేదోననే టెన్షన్ ఫ్యాన్స్ ని నలిపేస్తోంది. ఒకవైపు భారీ అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు వాటి మీద వడ్డీ పెరుగుతోందని ప్రొడ్యూసర్ మీద ప్రెజర్ తెస్తున్నారు.

గతంలో అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లను రద్దు చేసుకుంటామని ఇంకోపక్క ఎగ్జిబిటర్లు పోరు మొదలుపెట్టారట. ఇవి చాలవన్నట్టు ఓటిటి హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్ ఇకపై మరింత ఆలస్యం జరిగే పక్షంలో లీగల్ గా ముందుకెళ్లే ఆలోచన చేస్తామని బెదిరింపు చేసినట్టుగా చెన్నై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే ఒప్పందం ప్రకారం జనవరి 9 నుంచి నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ జరిగేలా రాసుకున్నారట. కానీ అసలు గడువు నాటికి జన నాయకుడు థియేటర్ రిలీజ్ కావడమే పెద్ద అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద సస్పెన్స్ నెలకొంది.

కాసులు కురిపించే కామధేనువుగా కోలీవుడ్ భావించే సంక్రాంతి సీజన్ ఈసారి వాళ్లకు పీడకలగా నిలిచిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పరాశక్తి సూపర్ ఫ్లాప్ గా నిలిస్తే, కార్తీ వా వతియార్ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఉన్నంతలో జీవా సినిమా ఒక్కటే బాగా ఆడుతూ కాసిన్ని డబ్బులు చూపిస్తోంది.

జన నాయకుడు కనక వచ్చి ఉంటే కనీసం మూడు వందల కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరిగేదని బయ్యర్లు వాపోతున్నారు. తీర్పు వస్తే కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేని నిస్సహాయత నెలకొనడంతో కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పాజిటివ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది. మరి దీనికి క్లైమాక్స్ ఎప్పుడు దొరుకుతుందో.