ధరలు తగ్గించిన ప్రసాద్ గారికి ఇంకో ఛాన్స్

మన శంకర వరప్రసాద్ గారుకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి రెగ్యులర్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చేశాయి. జిఓలో తెచ్చుకున్న స్పెషల్ పర్మిషన్లు నిన్నటితో అయిపోవడంతో ఇవాళ అన్ని కేంద్రాల్లో సాధారణ రేట్లు పెట్టేశారు. మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 80 నుంచి 105 రూపాయల మధ్యలో మెగా మూవీని ఎంజాయ్ చేయొచ్చు.

ఇప్పటిదాకా మూడు వందల కోట్ల గ్రాస్ దాటేసిన వరప్రసాద్ మొన్న సోమవారం నుంచి డ్రాప్ నమోదు చేసింది. ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోకపోయినా సీడెడ్ లాంటి ప్రాంతాల్లో జిఓలో ఇచ్చిన రేట్లను కొనసాగించడం వల్ల మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రాలేదు.

ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆడుకునే ఛాన్స్ వచ్చింది. నాలుగో శనివారం, సండే హాలిడే, సోమవారం రిపబ్లిక్ డే ఇలా మొత్తం మూడు రోజులు పెద్ద వీకెండ్ దొరికింది. మార్కెట్ లో ఫస్ట్ ఆప్షన్ గా ఇదే నిలుస్తోంది కాబట్టి శుక్రవారం నుంచి ఆక్యుపెన్సీలు తిరిగి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బిసి సెంటర్లలో ఈ సినిమా చూడని ఆడియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా ఈ వారం కొత్త రిలీజులు అంతగా లేకపోవడంతో మన శంకరవరప్రసాద్ గారుకి పెద్ద అడ్వాంటేజ్ దక్కుతుంది. అనగనగా ఒక రాజు సైతం మంచి టాక్ తో నడుస్తున్నప్పటికీ చిరు సినిమాతో పోలిస్తే అంత దూకుడుగా లేదన్నది వాస్తవం.

ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు ముందున్న టార్గెట్ 400 కోట్లు. దానికి ఈ వారాంతం చాలా కీలకం కానుంది. ఎందుకంటే మూడో వారం ఇంత స్పీడ్ ఉంటుందని ఆశించలేం. పైగా పండగ టైంలో గరిష్ట సంఖ్యలో ఆడియన్స్ చూసేశారు. బ్యాలన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు థియేటర్లకు వెళ్ళిపోతారు.

ఓటిటి కోసం ఎదురు చూస్తున్న బ్యాచ్ ఒకటే పెండింగ్ ఉంటుంది. సో ఏ మేజిక్ జరిగినా అది రిపబ్లిక్ డేకల్లా కావాలి. డిస్ట్రిబ్యూటర్ల అంచనా ప్రకారం రేపటి నుంచి సోమవారం దాకా వరప్రసాద్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. అభిమానులు దాని కోసమే ఎదురు చూస్తున్నారు. అందుకే సోషల్ మీడియా సౌండ్ కొంచెం తగ్గింది.