టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. “కంటెంట్ ఉంటే కింగ్, లేదంటే ఆడియన్స్‌కి దొరికేస్తారు”. ఒకప్పుడు కేవలం స్టార్ ఇమేజ్‌తో నెట్టుకొచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు సినిమా ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో మీమ్స్ తో ముంచేస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా ఈ ‘దొరికేస్తారు’ అనే భయం నుంచి బయటపడటానికి కసితో వర్క్ చేస్తున్నారు. 2026 సంవత్సరం టాలీవుడ్‌కు ఒక భారీ టెస్ట్ లాంటిది.
ముందుగా సమ్మర్ విండోలో పవన్ కళ్యాణ్ తన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో మాస్ గర్జన వినిపించడానికి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ తో ఈ ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వద్ద హడావుడి గట్టిగానే ఉండొచ్చు. అదే సమయంలో ‘పెద్ది’గా రామ్ చరణ్ ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాతో మార్చి 27న రాబోతున్నారు. బుచ్చిబాబు సానా ఈ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఏ మాత్రం కథ అటు ఇటు అయినా ఆడియన్స్ అస్సలు వదలరు.
ఇక నాని ‘ది ప్యారడైజ్’ పేరుతో ఇండియాస్ మ్యాడ్ మ్యాక్స్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌తో సమ్మర్ లోనే రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం నాని కెరీర్‌లో ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి. మరోవైపు అడివి శేష్ తన ‘డెకాయిట్’ తో మార్చి 19న ఉగాది కానుకగా మన ముందుకు వస్తున్నారు. మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఆయన చేస్తున్న ఈ క్రైమ్ లవ్ స్టోరీలో శేష్ ‘మాస్ క్యారెక్టర్’ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సమ్మర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. వీరిద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే గర్జన గ్యారంటీ అనిపిస్తోంది. అటు నిఖిల్ ‘స్వయంభూ’ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది, ఇది ఒక వారియర్ స్టోరీ. నాగ చైతన్య ‘వృషకర్మ’ అనే మైథాలజికల్ థ్రిల్లర్‌తో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అఖిల్ ‘లెనిన్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’, సాయి దుర్గ తేజ ‘సంబరాల ఏటీగట్టు’ వంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.
ఇక 2026లో ఎవరూ ‘దొరికిపోకుండా’ గర్జించాలని ప్రతి హీరో తాపత్రయపడుతున్నారు. విశ్వక్ సేన్ ‘ఫంకీ’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి చిన్న సినిమాలు కూడా కంటెంట్ నమ్ముకుని బరిలోకి దిగుతున్నాయి. ఈ ఏడాది విడుదల కాబోతున్న ఈ భారీ లైనప్‌లో ఆడియన్స్ మనసు గెలుచుకుని ఎవరు రియల్ కింగ్స్ అనిపిస్తారో, ఎవరు మీమ్స్ కి దొరికిపోతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates