దృశ్యం 3… అంత లేటైతే ఎలా వెంకీ?

మ‌లయాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత‌ బ‌హు భాష‌ల్లో రీమేక్ అయి ప్ర‌తి చోటా విజ‌య‌వంత‌మైన సినిమా.. దృశ్యం. దీనికి కొన‌సాగింపుగా ఓటీటీ వ‌ర‌కే రిలీజైన దృశ్యం-2 మ‌ల‌యాళ వెర్ష‌న్ కూడా అద్భుతమైన స్పంద‌న తెచ్చుకుంది. ఐతే ఆల్రెడీ ఓటీటీలో వివిధ భాష‌ల వాళ్లు చూసేసిన సినిమాను తెలుగులో మ‌ళ్లీ రీమేక్ చేసి ఓటీటీలోనే రిలీజ్ చేయ‌డం విడ్డూరం. అందుకే తెలుగులో దృశ్యం-2 మొదటి భాగమంత ప్ర‌భావం చూప‌లేక‌పోయింది.

ఐతే ఇప్పుడు దృశ్యం-3 విష‌యంలోనూ ఇదే జ‌ర‌గ‌బోతోందనే సందేహాలు మొదలవుతున్నాయి. మ‌ల‌యాళంలో ఆల్రెడీ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. ఏప్రిల్ 2న రిలీజ్‌కు స‌న్నాహాలు కూడా చేస్తున్నారు. ఎలాగూ రీమేకే, పైగా తీసేది ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ జీతు జోసెఫే కాబ‌ట్టి తెలుగు వెర్ష‌న్‌ను కూడా వీలైనంత త్వ‌ర‌గా మొద‌లుపెట్టి మ‌ల‌యాళ వెర్ష‌న్‌తో పాటుగా లేదా, త‌క్కువ గ్యాప్‌లో రిలీజ్ చేస్తే బెట‌ర్ అన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ వెంకీ ఈ సినిమా కోసం చాలా టైం తీసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డైంది.

తెలుగులో అస‌లు దృశ్యం-3 ఉంటుందా లేదా అన్న మీమాంస‌కు తాజాగా నిర్మాత, వెంక‌టేష్ అన్న‌య్య‌ సురేష్ బాబు తెర‌దించారు. ఈ సినిమా అక్టోబ‌రులో సెట్స్ మీదికి వెళ్లే అవ‌కాశాలున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ సినిమా ఉంటుంద‌న్న వార్త అభిమానుల‌కు సంతోషాన్నిచ్చేదే కానీ.. మ‌రీ అక్టోబ‌రులో మొద‌లుపెడితే ఎలా అన్న‌దే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఏప్రిల్లో మ‌ల‌యాళ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ‌వ్వ‌గానే క‌థేంటో బ‌య‌టికి తెలిసిపోతుంది. ఇంకో నెల రోజుల‌కు మ‌ల‌యాళ వెర్ష‌న్ ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చేస్తుంది. ఈ సీక్వెల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇత‌ర భాష‌ల వాళ్లు కూడా స‌బ్ టైటిల్స్ పెట్టుకుని సినిమా చూసేస్తారు. అలాంట‌పుడు ఇంకో ఆరు నెల‌ల త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్టి కొత్త ఏడాదిలో రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆ సినిమా ప‌ట్ల ఏం ఆస‌క్తి ఉంటుంద‌న్న‌ది సందేహ‌మే.

మ‌రోవైపు చాలా ముందే మొద‌లు కావాల్సిన‌ హిందీ వెర్ష‌న్‌ను కూడా జీతు జోసెఫ్ ఆపించాడు. మ‌ల‌యాళ వెర్ష‌న్ రిలీజ‌య్యాకే దాని విడుద‌ల ఉండాల‌ని ష‌ర‌తు పెట్టాడు. దీంతో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టాల్సి వ‌చ్చింది.