ది రాజా సాబ్ విషయంలో కలిగిన అసంతృప్తిని ప్రభాస్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు. దర్శకుడు మారుతీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్రెష్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఎలివేషన్లు అన్నీ బయటికి తీసి కొత్తగా ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కనీసం యావరేజ్ అయినా ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు. కానీ డిజాస్టర్ తోనూ రెండు వందల కోట్లు వసూలు చేయగలిగే సత్తా ఉన్నా డార్లింగ్ ని వృథా చేసుకున్నారంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇదంతా గడిచిపోయిన గతం.
ఇప్పుడు మారుతీ తన మీద తగ్గిపోయిన నమ్మకాన్ని సున్నా నుంచి సృష్టించుకోవాలి. కేవలం ఒక ఫ్లాప్ తోనే ఎవరి క్యాలిబర్ ని అంచనా వేయలేం కానీ కంబ్యాక్ కి ఎలాంటి కథ అవసరమో ముందు దాన్ని గుర్తించాలి. మృగరాజు పోయాకే గుణశేఖర్ ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు.
అఖండకు ముందు బోయపాటి శీను తీసిన వినయ విధేయ రామ ఏమయ్యిందో చెప్పాల్సిన పని లేదు. వివి వినాయక్ ట్రాక్ రికార్డు పట్టించుకుని ఉంటే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 వచ్చేది కాదు. ఇదేదో మారుతీని సమర్ధించే ప్రయత్నం కాదు. శూన్యం నుంచి వెలుగులోకి ఎలా వెళ్ళొచ్చో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అసలు అనౌన్స్ మెంటే లేని వరుణ్ తేజ్ సినిమాని మారుతీ డైరెక్ట్ చేస్తున్నాడనే ప్రచారం కూడా గాసిప్పుల్లో నుంచి పుట్టిందే. రాజా సాబ్ వల్ల కలిగిన మరో సమస్య కలిగింది. సాహో లాగా హిందీ మార్కెట్స్ లో డీసెంట్ రెవిన్యూస్ వచ్చి ఉంటే డ్యామేజ్ తగ్గేది. కనీసం రాధే శ్యామ్ లాగా అక్కడక్కడా ఆడి ఉంటే ఓకే అనుకునే పరిస్థితి ఉండేది. కానీ అవేవి జరగలేదు.
సంక్రాంతికి కాంపిటీషన్ ఉన్నవన్నీ దెబ్బ తింటాయని భావిస్తే రివర్స్ లో అవే హిట్టయిపోయి రాజా సాబ్ బోల్తా కొట్టడం ఊహించని షాక్. త్వరలోనే కొత్త సినిమా ప్రకటన ఇస్తానని చెబుతున్న మారుతీ చిరంజీవి కోసం ఒక సబ్జెక్టు రాసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాలి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates