ఒక సినిమా టైటిల్‌ను పదేళ్ల తర్వాత ఇంకో చిత్రం కోసం వాడుకునే సౌలభ్యం ఉంటుంది. కాబట్టే ఆకర్షణీయమైన పేర్లను రిపీట్ చేస్తుంటారు. కానీ సినీ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిన చిత్రాల టైటిళ్లను మళ్లీ వాడాలంటే కొంచెం ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది. ఆ టైటిళ్లకు న్యాయం చేసేలా సినిమా లేకపోతే.. ప్రేక్షకులు నిరాశ చెందుతారు. ఐకానిక్ టైటిళ్లను చెడగొట్టినట్లు అవుతుంది.
మాయాబజార్, మరో చరిత్ర సహా ఎన్నో లెజెండరీ సినిమాల టైటిళ్లు ఇలాగే వృథా అయ్యాయి. ఐతే మిస్సమ్మ, తొలి ప్రేమ లాంటి కొన్ని టైటిళ్లకు మాత్రం న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ కోవలోకే చేరింది నారీ నారీ నడుమ మురారి టైటిల్. నందమూరి బాలకృష్ణ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి.
ఎక్కువగా మాస్ మసాలా సినిమాలు చేసిన బాలయ్యకు.. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిఫరెంట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో పాటలు కూడా విజయవంతం అయ్యాయి. ఇప్పుడు ఈ టైటిల్‌నే శర్వానంద్ సినిమాకు వాడుకున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన కొత్త నారీ నారీ నడుమ మురారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా, రేసులో లేటుగా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. తక్కువ థియేటర్లలోనే మంచి వసూళ్లు సాధిస్తోంది. శర్వాకు చాన్నాళ్ల తర్వాత దక్కిన విజయమిది. సంక్రాంతి సీజన్లో అతను హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు. దీనికి యాప్ట్ టైటిల్ పెట్టారని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది.
ఈ సినిమా విజయవంతమైన నేపథ్యంలో బాలయ్య కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడట. బాలయ్య తనకు ఫోన్ చేసి.. నా పరువు నిలబెట్టావు శర్వా అని చెప్పినట్లు శర్వా నారీ నారీ నడుమ మురారి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో వెల్లడించాడు.
పదేళ్ల తర్వాత ఏ టైటిలైనా వాడుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ.. బాలయ్య చిత్రం పేరును ఉపయోగించుకోవడానికి శర్వా ఆయన అనుమతి కోరడం విశేషం. అందుకు బాలయ్య సంతోషంగా ఒప్పుకున్న విషయాన్ని కూడా శర్వా ఇంతకుముందు వెల్లడించాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారిలో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య నటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates