కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు. నాని, వెంకటేష్, గోపీచంద్ లాంటి హీరోలతో ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమాలు తీశాడు. అలాంటి ట్రాక్ రికార్డున్న అతడికి ఒకేసారి ప్రభాస్‌తో రూ.400 కోట్ల సినిమా చేసే అవకాశం దక్కింది.
ఐతే వీరి కలయికలో వచ్చిన రాజాసాబ్ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరిగా ఆడిందంతే. ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయిన మారుతి.. తన తర్వాతి చిత్రాన్ని ఎవరితో చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఐతే మెగా హీరో వరుణ్ తేజ్‌తో మారుతి సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రచారం మొదలైంది. వీరి కలయికలో కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని మారుతి సన్నిహిత వర్గాలు ఖండించాయి.
మారుతి కొత్త సినిమా గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. తన తర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖరారు కాలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు సన్నిహితులు. బహుశా మారుతి ఇంకా తన కొత్త సినిమాకు కథ రెడీ చేసి ఉండకపోవచ్చు. స్క్రిప్టు రెడీ అయ్యాకే దానికి తగ్గ హీరోను ఎంచుకోవాలని భావిస్తుండొచ్చు.
రాజాసాబ్ లాంటి భారీ చిత్రం తర్వాత మళ్లీ పెద్ద సినిమానే తీయాలనేమీ తాను ఫిక్స్ కాలేదని.. ఆ సమయంలో ఏ కథ కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని.. చిన్న సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమే అని మారుతి ఇంతకుముందు స్పష్టం చేశాడు. ఇప్పుడతను బలమైన స్క్రిప్టుతో రంగంలోకి దిగాల్సిందే.
మారుతి బలం కామెడీ. కానీ రాజాసాబ్‌లో ఆ బలాన్ని అతను చూపించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కామెడీ వర్కవుట్ కాకపోవడంతో సినిమా దెబ్బ తింది. కాబట్టి ఈసారి తన ఫన్ పవర్ చూపించి మంచి ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి. అతడి కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
