ప్యారడైజ్ తప్పుకోవడం పెద్దికి మంచిదే

గత కొన్ని నెలలుగా మూవీ లవర్స్ మధ్య విపరీతంగా చర్చకు వచ్చిన టాపిక్ పెద్ది – ప్యారడైజ్ బాక్సాఫీస్ క్లాష్. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో మార్చి 26, 27 తేదీల్లో రెండూ విడుదలవుతాయని పలు సందర్భాల్లో ఆయా యూనిట్లు పదే పదే నొక్కి చెప్పడంతో, పరస్పరం ఓపెనింగ్స్ దెబ్బ తింటాయేమోనని రామ్ చరణ్, నాని అభిమానులు టెన్షన్ పడుతూ వచ్చారు.

అయితే ప్యారడైజ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి దానికి క్లారిటీ ఇచ్చారు. ఒకే టైంలో రెండూ రావని, పెద్ది వస్తే ప్యారడైజ్ వదలమని ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టేశారు. మేమంతా స్నేహితులమని, మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్ల మీద ఎక్కువ సినిమాలు రుద్దడం వల్ల ఇబ్బంది తలెత్తిందని, అందుకే ప్యారడైజ్ విషయంలో అలాంటి పొరపాటు చేయమని అన్నారు. మొన్న ఇదే బ్యానర్ లో వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కాంపిటీషన్ కారణంగానే అనుకున్న స్థాయిలో పెద్ద రెవిన్యూ రాబట్టలేకపోయింది.

ఒకవేళ పోటీ తక్కువగా ఉంటే మెరుగైన ఫలితం దక్కేది. ప్రేక్షకులకు సరిపడా వినోదం దక్కినా పంపిణీదారులు థియేటర్లను సర్దలేక పడిన తిప్పలు అన్ని ఇన్ని కావు. ప్యారడైజ్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అనిరుధ్ రవిచందర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ సమయం డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్పుడు ప్యారడైజ్ తప్పుకోవడంతో పెద్ది మార్చి చివరి వారంలో సోలోగా ఉంటుంది. అలాని ముప్పు తప్పినట్టు కాదు. మార్చి 19 దురంధర్ 2, టాక్సిక్, డెకాయిట్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి తప్పుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ మహా క్లాష్ కనక కన్ఫర్మ్ అయితే పెద్దికి ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య తలెత్తుతుంది.

ఇప్పటికైతే అందరూ ఎవరి మాటకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఇక ప్యారడైజ్ నెక్స్ట్ సమ్మర్ వైపు చూస్తోంది. మే, జూన్ ఆప్షన్లు సీరియస్ గా పరిశీలిస్తున్నారట. ఇది పూర్తయ్యాకే ఇదే బ్యానర్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో చేయబోయే సినిమాను మొదలుపెట్టాల్సి ఉంటుంది.