టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటేనే మినిమమ్ గ్యారెంటీ. కానీ కొన్నిసార్లు అంచనాలు భారీగా ఉన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతుంటాయి. 2011లో వచ్చిన ‘పరమ వీర చక్ర’ నుండి గతేడాది ‘గేమ్ ఛేంజర్’ వరకు చాలా పెద్ద సినిమాలు ఈ సీజన్‌లో చేతులు కాల్చుకున్నాయి. తాజాగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ప్రభాస్ ‘ది రాజాసాబ్’ కూడా ఇప్పుడు అదే తరహా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.
గత చరిత్రను పరిశీలిస్తే, మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వంటి క్రేజీ ప్రాజెక్టులు సంక్రాంతికి వచ్చి నిరాశపరిచాయి. అలాగే 2019లో వచ్చిన ‘NTR కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ చిత్రాలన్నీ సంక్రాంతి పండగ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమై భారీ నష్టాలను మిగిల్చాయి.
ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రభాస్ గ్లోబల్ ఇమేజ్, మారుతి కామెడీ టైమింగ్ పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఆకట్టుకున్నా, కథనంలో గ్రిప్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల వసూళ్లపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
వ్యాపార పరంగా చూస్తే ఈ సినిమా ఇంకా సేఫ్ జోన్ లోకి రాలేదు. భారీ రేట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడవడంతో, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకోవాలంటే మరో 45% రికవరీ కావాల్సి ఉంది.
పండగ సెలవులు పూర్తయిపోయిన తరుణంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం రాజాసాబ్ కు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది. నిజానికి సంక్రాంతి పోటీలో గెలవాలంటే కంటెంట్ పక్కాగా ఉండాలి. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ వల్ల ఓపెనింగ్స్ బాగున్నా, లాంగ్ రన్ లో నిలబడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా అవసరం. గతంలో ఫెయిల్ అయిన పెద్ద సినిమాల జాబితాలో ఇప్పుడు కొత్తగా రాజసాబ్ కూడా చేరుతుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
