పదేళ్ల విరామం తర్వాత సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. వేగంగానే సినిమాలు చేసుకుంటూ వచ్చారు కానీ.. తన చివరి చిత్రం ‘భోళా శంకర్’ రిలీజయ్యాక మాత్రం అనుకోకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. ‘విశ్వంభర’ వాయిదా పడిపోవడంతో దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆయన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదలైంది. మెగా అభిమానులు ఆశించిన దాని కంటే పెద్ద విజయం దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది.
విశేషం ఏంటంటే.. రెండున్నరేళ్ల పాటు వచ్చిన గ్యాప్‌ను కవర్ చేసేలా చిరు ఈ ఏడాది ఇంకో రెండు చిత్రాలతో పలకరించబోతున్నాడు. గత ఏడాదే రావాల్సిన ‘విశ్వంభర’ను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసమే దాన్ని మరింత వెనక్కి జరిపారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాపీగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. బెస్ట్ ఔట్ పుట్‌తో సమ్మర్ మధ్యలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మరోవైపు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత ఖాళీ అయిపోతున్న చిరు.. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాబీ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఆ సినిమాకు పక్కాగా స్క్రిప్టు రెడీ అయిపోయింది. షెడ్యూళ్లు కూడా వేసేశారు. మరి కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ మొదలు కానుంది. బాబీ స్పీడుగానే సినిమా తీస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా లేదా దీపావళికే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికి వచ్చే ఏడాది సంక్రాంతి అంటున్నారు కానీ షూటింగ్ పనులు వేగంగా జరిగిపోతే దీపావళి లోపే వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలెం.
అదే జరిగితే ఒకే ఏడాది మూడు చిత్రాలతో చిరు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే అనూహ్యమే. కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. బహుశా టాలీవుడ్ టాప్ స్టార్లలో ఎవరికీ ఈ రికార్డు ఉండదేమో. ఐతే ఈ రికార్డు చిరు సొంతమవుతుందా లేదా అన్నది బాబీ చేతుల్లోనే ఉంది. ఈ ఏడాది చివరిలోపు ఈ చిత్రాన్ని విడుదల చేయలేని పక్షంలో వచ్చే ఏడాది కూడా సంక్రాంతికే చిరు బరిలో నిలిచే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
