సంక్రాంతి 2027… తొందరపడుతున్న కోయిలమ్మలు

ఆలు లేదు చూలూ లేదు అని ఏదో సామెత చెప్పినట్టు ఇంకా ఏడాది సమయం ఉండగానే 2027 సంక్రాంతి రిలీజుల గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. విచిత్రంగా వీటిలో అసలు షూటింగే మొదలుకానివి ఉండగా, మరికొన్ని ఈ సంవత్సరం విడుదలయ్యే ఛాన్స్ ఉన్న వాటిని కూడా పొందుపరుస్తున్నారు.

వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ చిరంజీవి – బాబీ కలయికలో తీయబోతున్న ప్యాన్ ఇండియా మూవీని పండగ బరిలోనే దింపాలని ప్రాథమికంగా ఫిక్స్ అయ్యారట. దానికి అనుగుణంగానే డేట్లు తీసుకున్న బాబీ అక్టోబర్ లోగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నారు. ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామాని టాక్.

శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ తీయబోయే సినిమా వచ్చే సంక్రాంతికి ఫిక్స్ అని శర్వానంద్ నిన్న నారి నారి నడుమ మురారి ఫంక్షన్ లో పబ్లిక్ గా చెప్పేశాడు. తక్కువ బడ్జెట్ కాబట్టి ఇబ్బందులు ఉండవు. తేజ సజ్జతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేసుకున్న జాంబీ రెడ్డి 2 (ప్రచారంలో ఉన్న టైటిల్) గతంలో అనౌన్స్ మెంట్ పోస్టర్ వదిలినప్పుడు అందులో పొంగల్ రిలీజని పేర్కొంది.

కానీ ఇంకా సెట్స్ పైకి అడుగు పెట్టని నేపథ్యంలో ఏ మేరకు డేట్ అందుకుంటుందనేది అనుమానమే. రజనీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి డైరెక్షన్లో కమల్ హాసన్ నిర్మిస్తున్న తలైవర్ 173 ఎట్టి పరిస్థితుల్లో పండగని మిస్ కాకూడదనే లక్ష్యంతో తీస్తున్నారట.

ఇక మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్టు వెంకటేష్ తోనే చేయొచ్చనే ప్రచారం బలంగా ఉంది. క్యామియోకి సిద్ధమని ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావించింది దీని గురించేనని ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ కాలేదు.

వీటితో పాటు సితార బ్యానర్ మరోసారి అనగనగా ఒక రాజు లాంటి మీడియం బడ్జెట్ ఎంటర్ టైనర్ ని దించే ప్లాన్ లో ఉందట. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ఎన్బికె 111 షూట్ ఆలస్యమయ్యే పక్షంలో అది కూడా ఈ లిస్టులోనే తోడవుతుంది. వీటిలో ఎవరూ మాట మీద ఉంటారో, ఎవరు ఖచ్చితంగా వస్తారో తేలాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.