గత రెండు దశాబ్దాల్లో దక్షిణాదిన ఉత్తమ నటుల్లో ఒకడిగా ఎదిగిన నటుడు విజయ్ సేతుపతి.. బహు భాషా నటుడిగా ఎదిగిన అతను.. మొదట్లో తమిళ సినిమాలతోనే ఇతర భాషా ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ‘పిజ్జా’తో మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో అతను తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగులోనూ ‘ఉప్పెన’ సహా కొన్ని చిత్రాలతో బలమైన ముద్ర వేశాడు.
టాలీవుడ్లో తొలిసారి హీరోగా నటించిన ‘స్లమ్ డాగ్’ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. సేతుపతి పుట్టిన రోజును పురస్కరించుకునే ఈ లుక్ లాంచ్ అయింది. ఇదే రోజు సేతుపతి నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ చిత్రం పేరు.. గాంధీ టాక్స్.
ఇది ‘పుష్పక విమానం’ స్టైల్లో తెరకెక్కిన సైలెంట్ మూవీ కావడం విశేషం. సైలెంట్ సినిమా ఎరాను వెనక్కి తీసుకు వస్తున్న చిత్రంగా టీజర్లో ఊరించింది చిత్ర బృందం. సేతుపతితో పాటు అరవింద్ స్వామి, అదితిరావు హైదరి లాంటి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. టైటిల్‌కు తగ్గట్లే ఇది ‘గాంధీ’ చుట్టూ తిరిగే సినిమా ఇది. గాంధీజీని రోజూ జనం చూసేది, గుర్తు చేసుకునేది కరెన్సీ నోటు ద్వారానే.
‘గాంధీ టాక్స్’లో క్యారెక్టర్లు ఏవీ మాట్లాడకపోయినా.. డబ్బు మాట్లాడుతుంది. డబ్బు ఏమేం పనులు చేయగలదో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు పచ్చనోటు ఇవ్వడంతో ఈ టీజర్ మొదలైంది. కరెన్సీ నోటు, అందులోని గాంధీ బొమ్మ మీదే ముఖ్యమైన షాట్స్ అన్నీ తీసి.. వాటినే టీజర్లో ప్రెజెంట్ చేశారు. పాత్రలను ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ముఖ్యంగా సేతుపతి, అరవింద్ స్వామిల క్యారెక్టర్లు క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం. కిషోర్ పాండురంగ్ బెలేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజేష్ కేజ్రివాల్, మీరా చోప్రా నిర్మించారు. ఈ నెల 30నే ‘గాంధీ టాక్స్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైలెంట్ మూవీ కాబట్టి.. ఫలానా భాషల్లో రిలీజవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates