రంగం హీరో సైలెంట్ హిట్టు కొట్టేశాడు

జీవా పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తు రాకపోవచ్చు కానీ రంగం హీరో అంటే ఫ్లాష్ అవుతుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి కొడుకుగా తమిళంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తున్న జీవావి ఈ మధ్య తెలుగులో పెద్దగా డబ్బింగ్ కావడం లేదు.

మార్కెట్ తగ్గిపోవడంతో మన ఆడియన్స్ దగ్గర గుర్తింపు అంతగా లేకపోవడం వల్ల హక్కులు కొనడం తగ్గిపోయింది. నిన్న తన కొత్త మూవీ ‘తలైవర్ తంబీ తలైమాయిల్’ విడుదలయ్యింది. జన నాయకుడు వాయిదా పడటంతో దీన్ని ఆఘమేఘాల మీద సెన్సార్ చేయించుకుని పొంగల్ బరిలో కార్తీ వా వతియార్ (అన్నగారు వస్తారు) కు పోటీగా నిలబెట్టారు.

విచిత్రంగా కార్తీ మూవీకి ఆశించిన రెస్పాన్స్ రాకపోగా తలైవర్ తంబీ తలైమాయిల్ ట్రెండ్ అవుతూ హిట్టు క్యాటగిరీ వైపు పరుగులు పెడుతోంది. బుక్ మై షోలో సగటున గంటకు 7 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మాములు విషయం కాదు. పెట్టిన బడ్జెట్ వారం లోపే రికవర్ అవుతుందని ఒక అంచనా.

ఇంతకీ కథేంటంటే హీరో జీవరత్నం ఒక చిన్న ఊరికి పంచాయితీ ప్రెసిడెంట్ గా ఉంటాడు. ఎన్నికలు దగ్గరవుతున్న టైంలో ప్రతి ఓటు విలువైందిగా మారుతుంది. ఇళవరసు కూతురు పెళ్లి జరుగుతున్న టైంలో తంబీ రామయ్య తండ్రి చనిపోతాడు. దీంతో శవయాత్రకు సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలవుతుంది.

దీన్ని ప్రెసిడెంట్ గా జీవరత్నం ఎలా పరిష్కరించాడు అనేదే తలైవర్ తంబీ తలైమాయిల్ కథ. లైన్ వినడానికి సీరియస్ గా ఉన్నా దర్శకుడు నితీష్ సహదేవ్ పూర్తి వినోదాత్మకంగా తీశారు. సున్నితమైన అంశాన్ని చక్కగా డీల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. అందుకే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

మొన్నటిదాకా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే ఉద్దేశం లేకపోయినప్పటికీ ఇప్పుడు ప్రేక్షకుల స్పందన చూశాక అనువదించాలని నిర్ణయం తీసుకున్నారట. మొత్తం గ్రామీణ వాతావరణంలో జరిగే బ్యాక్ డ్రాప్ కావడంతో కోలీవుడ్ లో మంచి ఆదరణ దక్కుతోంది. పొంగల్ విన్నర్ ఇదేననే ప్రచారం చెన్నై మీడియాలో జోరుగా సాగుతోంది.